మూసీ జల ప్రళయం.. పురాణాపూల్లో శివాలయంలో చిక్కుకున్న పూజారి కుటుంబం.. హైదరాబాద్ MGBS మునిగిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే..

మూసీ జల ప్రళయం.. పురాణాపూల్లో శివాలయంలో చిక్కుకున్న పూజారి కుటుంబం.. హైదరాబాద్ MGBS మునిగిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ ఘాట్, మూసారాం బాగ్, ఎంజీబీఎస్, పురానాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురానాపూల్లో శివుని ఆలయం మునిగిపోయింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా అనిపించాయి. పురానాపూల్ శివుడి దేవాలయం పై భాగం వరకు వరద నీరు వచ్చింది.

పురాణాపూల్ స్మశాన ఘాట్ నీట మునిగింది. స్మశాన ఘాట్లో ఉన్న వాహనాలు మొత్తం నీట మునిగిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటిమట్టం పెరగడంతో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ మిథిలా నగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ వాసులు బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసా నగర్, శంకర్ బస్తీలు మూసీ వరద ప్రవాహం కారణంగా జలదిగ్భంధంలో కూరుకుపోయాయి.

మూసీకి భారీగా వరద వస్తుండటంతో రాజేంద్రనగర్, చాదర్ ఘాట్, అంబర్ పేట్, రామంతపూర్ పరిసర ప్రాంతాలల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే MGBS బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. బస్టాండు లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తీవ్రత ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి బస్టాండ్ నుంచి ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.