ఓయూ వీసీపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆగ్రహం

ఓయూ వీసీపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆగ్రహం
  • బాండ్ అగ్రిమెంట్తో ఉద్యోగ భద్రతకు ప్రమాదం: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు వర్సిటీ అధికారులు విధించిన బాండ్ అగ్రిమెంట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనబాట పట్టారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి లేడీస్ హాస్టల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బాండ్ అగ్రిమెంట్ ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వర్సిటీలో సమస్యలకు కారణం అవుతున్న  వీసీని వెంటనే రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ . పరుశురాం , కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తుంటే మరోవైపు ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు భంగం కలిగేలా బాండ్ అగ్రిమెంట్  ఇవ్వాలని ఓయూ వీసీ నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. గత 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తమకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బాండ్ అగ్రిమెంట్ ప్రతిపాదన చూడ లేదన్నారు. ఏ యూనివర్సిటీలో లేనివిధంగా ఓయూలో మాత్రమే ప్రవేశపెట్టడం బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. 

తమ ఉద్యోగాలను ఊడగొట్టాలనే వీసీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు . బాండ్ అగ్రిమెంట్ లో ఉన్న అంశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని, తమను ఎప్పుడు తొలగించినా అభ్యంతరం చెప్పబోమని ఎలా సంతకం చేసి ఇస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలలో కోత , ఇంక్రిమెంట్ల నిలుపుదల వంటి అంశాలు ఉన్న ఈ బాండ్ పేపర్తో తమ ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు . ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోకుంటే  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ , డాక్టర్ కవిత , డాక్టర్ తిరుపతి, డాక్టర్ విజయ, డాక్టర్ వినీత పాండే , జితేందర్ రెడ్డి, ప్రేమయ్య తదితరులు పాల్గొన్నారు.