పద్మారావునగర్, వెలుగు: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన జడగ లక్ష్మి కాంతారావు దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను ఉమాశంకర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించాడు. కొన్ని నెలలుగా ఉమాశంకర్ మద్యం మత్తులో ఫోన్ చేసి వేధిస్తుండడంతో ఆమె వివాహ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
దీంతో పవిత్రపై కోపం పెంచుకున్న ఉమాశంకర్.. డిసెంబర్ 8న ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు బుధవారం ఉదయం చిలకలగూడ స్కందగిరి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉమాశంకర్ యూసుఫ్‌గూడ రెహమత్‌నగర్‌లో నివసిస్తూ టైల్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

