మాదాపూర్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బుల కోసం ఐటీ కారిడార్‌లో హోటళ్లు, హాస్టళ్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొంగలిస్తున్న పాత నేరస్తుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 31 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లాకు చెందిన సందీప్‌కుమార్‌రెడ్డి(24) బాచుపల్లిలోని సాయినగర్‌లో నివాసం ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం గ్యాస్ కొరతతో సిలిండర్లకు డిమాండ్ ఉండటంతో ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లు, హోటళ్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను దొంగలిస్తున్నాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వినియోగిస్తున్నాడు. వరుసగా సిలిండర్లు దొంగతనం అవుతుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో ఫొటో మ్యాచ్ కావడంతో నిందితుడు గతంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డ సందీప్‌కుమార్‌రెడ్డిగా గుర్తించి అరెస్ట్ చేశారు. రూ.1.50 లక్షల విలువైన 31 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌కుమార్‌రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు, బాచుపల్లి, ఎస్‌ఆర్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదై ఉన్నాయి.
