పశువుల అక్రమ రవాణా, ఇండ్లలో చోరీలు.. వందల కేసులున్న ఇద్దరు అరెస్టు

పశువుల అక్రమ రవాణా, ఇండ్లలో చోరీలు.. వందల కేసులున్న ఇద్దరు అరెస్టు
  • 5 తులాల బంగారం,  కేజీ వెండి స్వాధీనం  చేసుకున్న పోలీసులు

మియాపూర్, వెలుగు: పశువుల అక్రమ రవాణాతోపాటు తాళం వేసిన ఇండ్లే టార్గెట్​గా చోరీలు చేస్తున్న ఇద్దరిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. సోమవారం మియాపూర్ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సైదాబాద్​ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్, గోల్కొండ ఝాన్సీ బజార్​ ప్రాంతానికి చెందిన మహ్మద్ అయూబ్ పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాళం వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. 

గత నెల 11న ఆర్సీపురం నందన్​రతన్ ప్రైడ్​కు చెందిన మస్తాన్ ఇంట్లో 21 తులాల బంగారం, 3 కేజీల వెండి, కొంత నగదు చోరీ చేశారు. బాధితుడి బంధువు మహ్మద్ సోహైల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసిన అవేజ్​అహ్మద్, అయూబ్​ను అరెస్ట్​చేశారు. దొంగిలించిన బంగారాన్ని అయూబ్​భార్య గోల్డ్​షాపుల్లో అమ్ముతుందని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇద్దరూ జైలుకెళ్లొచ్చారు..

అవేజ్ అహ్మద్​2006 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. 103 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతను​రేచీకటి సమస్యతో బాధ పడుతుండగా..  పగటి పూటనే కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేసేవాడు. ఇప్పటివరకు 8 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. మేడిపల్లి, కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​లో అవేజ్​పై పీడీ యాక్ట్​నమోదైంది. 

జైలులో ఉన్నప్పుడు అవేజ్​కు అయూబ్​ పరిచయమయ్యాడు. అయూబ్ 2007 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు 238 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 11 పోలీస్​స్టేషన్ల పరిధిలో అరెస్టయి  జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై శంషాబాద్,  చిలకలగూడ పోలీస్​ స్టేషన్లలో పీడీ యాక్ట్​నమోదైంది.  జైలు నుంచి బయటకొచ్చాక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని ఏసీపీ తెలిపారు.

బైక్​లను ఎత్తుకెళ్తున్న అంతర్రాష్ట్ర దొంగలు..  

ఇండ్లు, అపార్ట్​మెంట్లు, షాపుల ఎదుట పార్కింగ్​చేసిన బైక్​లే టార్గెట్​గా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్​చేశారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నారాయణపురానికి చెందిన నాలందుర్గ శ్రీనివాస్ సాయి కిరణ్ , గొట్టపు లీలసాయి, ఈస్ట్​గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన విజయ్ శివసాయి ప్రసాద్, ఇదే జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ప్రవీణ్ ముఠాగా ఏర్పడ్డారు. 

ఈజీగా డబ్బు సంపాదించేందుకు బైక్​లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. నగరానికి వచ్చి అర్ధరాత్రి అపార్ట్​మెంట్లు, ఇండ్లు, షాపులు, హాస్టళ్ల ఎదుట పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్​లను దొంగతనం చేస్తున్నారు. వాటిని సొంతూళ్లకు తీసుకెళ్లి, ఇంజిన్, చాసిస్​నంబర్లను మార్చేస్తున్నారు. అనంతరం వాహనాలను తెలిసిన వారికి అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. 

21 బైక్​లు స్వాధీనం..

ఇటీవల మియాపూర్​పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ బైక్​చోరీకి గురవడంతో యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా శ్రీనివాస్​సాయికిరణ్, లీల సాయిని అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 21 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. విజయ్​శివసాయి ప్రసాద్ ను​ఏపీలోని అనకాపల్లిలో ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్​ను దొంగలిస్తుండగా అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. 

వీరిపై కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలో 11, అమీన్​పూర్​లో 3, చందానగర్​లో 3, గచ్చిబౌలిలో 3, మియాపూర్​లో ఒకటి, ఆర్సీపురంలో ఒక బైక్​చోరీలు కేసులు నమోదయ్యాయి. మియాపూర్​సీఐ శివప్రసాద్, డీఐ రమేశ్​నాయుడు, డీఎస్సై నర్సింహారెడ్డి పాల్గొన్నారు.