నేను ఆరోగ్యంగానే ఉన్నా : హైదరాబాద్ పోలీస్ కమిషనర్

నేను ఆరోగ్యంగానే ఉన్నా : హైదరాబాద్ పోలీస్ కమిషనర్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆఫీసులో ఉండగానే అనారోగ్యంతో బాధపడుతుండగా.. వెంటనే పోలీస్ సిబ్బంది హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శాండిల్య ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చారాయన. కమిషనర్ స్వయంగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లో బీపీ, మరో చిన్న సమస్య వల్ల ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని.. అన్ని పరీక్షల తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉందని.. 24 గంటల డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నట్లు వెల్లడించారాయన. నవంబర్ 21వ తేదీ యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు స్పస్టం చేశారాయన. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నమ్మొద్దన్నారు పోలీస్ కమిషనర్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. అప్పట్లో సీపీగా ఉన్న సీవీ ఆనంద్ స్థానంలో.. సందీప్ శాండిల్యను నియమించింది ఎలక్షన్ కమిషన్. నెల రోజులుగా ఆయన పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని స్వయంగా ప్రకటించారు.