ఘోస్ట్ సిమ్ నెట్ వర్క్ పై ఆపరేషన్ ఆక్టోపస్..13 రాష్ట్రాల్లో 18 స్పెషల్ టీమ్స్ సోదాలు

ఘోస్ట్ సిమ్ నెట్ వర్క్ పై ఆపరేషన్ ఆక్టోపస్..13 రాష్ట్రాల్లో 18 స్పెషల్ టీమ్స్ సోదాలు
  • 1 3 రాష్ట్రాల్లో సోదాలు చేసిన 18 స్పెషల్​ టీమ్స్
  • 66 మంది అరెస్ట్ ..544 సిమ్ కార్డులు స్వాధీనం 
  • ఈ సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో దేశవ్యాప్తంగా 
  • రూ. 101.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్​ క్రిమినల్స్
  • ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్, జియో, ఇతర నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన 
  • 20 మంది ఏజెంట్లు అరెస్ట్​
  • గతంలో మ్యూల్ అకౌంట్లు, బ్యాంకు అధికారుల పనిపట్టిన కాప్స్
  • వివరాలు వెల్లడించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: సైబర్​నేరాలకు వెన్నెముకగా మారుతున్న ‘ఘోస్ట్ సిమ్’ నెట్​వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం భారీ స్థాయిలో చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’లో కీలక పురోగతి సాధించినట్టు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 66 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు  వెల్లడించారు. 

ఈ మేరకు బుధవారం‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్టోపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3.0’ వివరాలను   సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 1.0’, సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ నిర్వహించామని, తాజాగా సైబర్ నేరాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ చేపట్టామని కమిషనర్ వివరించారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయని తెలిపారు. ఈ దాడుల్లో 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాటిలో 432 సీల్డ్ సిమ్‌‌లు, 112 యాక్టివ్ సిమ్‌‌లు ఉన్నాయని పేర్కొన్నారు. 

అరెస్టయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ సరఫరాదారులు ఉన్నారని వెల్లడించారు. వీరంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్టు విచారణలో తేలిందన్నారు. ఈ కేసుల్లో మొత్తం మోసం విలువ రూ.101.87 కోట్లుగా గుర్తించినట్టు తెలిపారు. 

టెలికాం నెట్‌‌వర్క్‌‌లవారీగా పరిశీలిస్తే అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ -ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌‌టెల్‌‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారని కమిషనర్ పేర్కొన్నారు.

కేవైసీ పేరుతో మోసం

కొత్త సిమ్ తీసుకునేందుకు లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల బయోమెట్రిక్ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ‘నెట్‌‌వర్క్ సమస్య’, ‘సర్వర్ డౌన్’, ‘వేలిముద్ర సరిగా పడలేదు’ అంటూ నమ్మబలికి రెండు మూడు సార్లు బయోమెట్రిక్ తీసుకుని, వినియోగదారులకు తెలియకుండా అదనపు సిమ్‌‌లను యాక్టివేట్ చేస్తున్నట్టు వెల్లడించారు. 

మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నిరక్షరాస్యులు, పేదల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఉచిత ఇంటర్నెట్ ఇస్తామని ఆశ చూపించి అమాయకుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకుంటున్నట్టు తెలిపారు.

విదేశాల్లో నుంచే భారత నంబర్ల వినియోగం 

అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను వెంటనే ఈ-–సిమ్‌‌లుగా మార్చి విదేశాల్లో ఉన్న సైబర్ ముఠాలకు పంపిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. దీంతో వారు భారతీయ మొబైల్ నంబర్లను విదేశాల్లో నుంచే వినియోగిస్తూ వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి మ్యాట్రిమోనియల్, డేటింగ్ యాప్‌‌లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు.‘డిజిటల్ అరెస్ట్’, ‘సెక్స్‌‌టార్షన్’ లాంటి నేరాలకు కూడా ఈ నంబర్లనే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. భారత నంబర్లే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని తెలిపారు.

టెలికాం సంస్థలతో సమావేశం

ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యంత సీరియస్‌‌గా తీసుకుంటోందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌‌టెల్, జియో, వొడాఫోన్ -ఐడియా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే డీఓటీ, ట్రాయ్‌‌లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా చర్చించి కేవైసీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరనున్నట్టు తెలిపారు. 

పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై నిఘా పెంచడం, రియల్‌‌టైమ్ వెరిఫికేషన్ విధానం అమలు చేయడం, సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్‌‌లను వెంటనే డీయాక్టివేట్ చేయడంలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్‌‌వర్క్‌‌ల నుంచి బ్లాక్‌‌లిస్ట్ చేయాలని సూచించారు.

ప్రజలకు సూచనలు

ప్రజలు తమ ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని కమిషనర్ సజ్జనార్‌‌‌‌ హెచ్చరించారు. కేవలం అధీకృత డీలర్ల వద్ద మాత్రమే సిమ్ కార్డులు కొనుగోలు చేయాలని సూచించారు. తమ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ పోర్టల్ tafcop.sancharsaathi.gov.in ద్వారా తనిఖీ చేసుకోవాలన్నారు. 

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌‌లైన్‌‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న ‘సి-–మిత్ర’ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.