వానలపై.. పోలీసుల ఫోకస్

వానలపై.. పోలీసుల ఫోకస్
  • వాటర్ లాగింగ్స్, డ్రైనేజీల వద్ద హెచ్చరిక బోర్డులు
  • లోతట్టు ప్రాంతాల జనాల తరలింపు  
  • ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పర్యవేక్షణ

హైదరాబాద్, వెలుగు :  సిటీలో వరుస వానలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. డ్రైనేజీలు, ఓపెన్‌‌ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మెయిన్ రోడ్లు గుంతలమయంగా మారి డేంజర్‌‌‌‌ బెల్స్‌‌ మోగిస్తున్నాయి. మ్యాన్‌‌హోల్స్‌‌, రోడ్లపై వరద నీటితో వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో 3 కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టీమ్​లు రెస్క్యూ ఆపరేషన్స్‌‌ నిర్వహిస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాల్లోని వారిని పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

ముంపు ప్రాంతాల్లోనూ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా, ట్రాఫిక్ పోలీస్ యాప్స్‌‌లో అప్​డేట్ చేస్తూ అలర్ట్‌‌ చేస్తున్నారు. బల్దియా అధికారులతో కలిసి వాటర్‌‌‌‌ లాగింగ్‌‌ పాయింట్ల వద్ద సేఫ్టీ మెజర్స్‌‌ తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌‌ తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సీపీలు, జాయింట్‌‌ సీపీలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి తిరిగి వచ్చే సమయాల్లోనే ట్రాఫిక్ సమస్యలు వస్తుండగా నివారణ చర్యలకు సిగ్నల్స్‌‌ వద్ద సిబ్బందిని నియమించారు. రద్దీ ఎక్కువగా ఉన్న మెయిన్‌‌ రోడ్లపై వాటర్‌‌‌‌ లాగింగ్స్‌‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు.  సిటీ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో తీసుకోవలసిన జాగ్రత్తలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో  ఉన్నతాధికారుల పర్యటన..

మూసాపేట/ఘట్​కేసర్/: వరద ముంపునకు గురైన గాజులరామారంలోని వోక్షిత్ ఎన్ క్లేవ్, ఆదర్శ్ నగర్ ఏరియాలను బాలానగర్ డీసీపీతో కలిసి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం రాత్రి సందర్శించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 5 రోజులుగా కాలనీ వరదలోనే ఉందని స్థానికులు సీపీకి వివరించారు. ఘట్​కేసర్, పోచారంలోని ఎదులాబాద్, కొర్రెముల్​లో మూసీ పరివాహక ప్రాంతాల్లో మల్కాజిగిరి డీసీపీ జానకి పర్యటించారు. రోడ్లపై వరద ప్రవహిస్తున్నప్పుడు దాటే ప్రయత్నం చేయొద్దని ఆమె సూచించారు. ముంపు ప్రాంతాల జనం, పురాతన ఇండ్లల్లో ఉంటున్న సేఫ్ ఏరియాలకు వెళ్లాలన్నారు. ఎమర్జెన్సీ అయితే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. 

ALSO READ:గెరువియ్యని వానలు.. కూలుతున్న ఇండ్లు

ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పై సీపీ సమీక్ష

గచ్చిబౌలి: ఐటీ కారిడార్​లోని కంపెనీలన్నీ మరో రెండు వారాల పాటు 3 షిఫ్టుల్లో లాగ్ అవుట్ విధానాన్ని కొనసాగిస్తాయని.. ఇప్పటికే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వానలు, ఐటీ కారిడార్​లోని ట్రాఫిక్ పరిస్థితులపై గురువారం గచ్చిబౌలిలోని కమిషనరేట్​ ఆఫీసులో కమాండ్​ కంట్రోల్ సెంటర్​ ద్వారా సీపీ పర్యవేక్షించారు. 

బిగ్ స్క్రీన్​పై లైవ్ మానిటరింగ్ చేస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఫీల్డ్​లోనే ఉండాలన్నారు. వరద ఉన్న ఏరియాల్లో, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్లాస్టిక్ కోన్స్, బారికేడ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటుతో పాటు డైవర్షన్ అమలు చేయాలన్నారు.