లక్డీకాపూల్‌‌‌‌ పరిసరాల్లో వన్‌‌‌‌వే..! త్వరలో అమలుకు కసరత్తు చేస్తున్న పోలీసులు..

లక్డీకాపూల్‌‌‌‌  పరిసరాల్లో వన్‌‌‌‌వే..! త్వరలో అమలుకు కసరత్తు చేస్తున్న పోలీసులు..
  • పరిశీలించిన సీపీ సజ్జనార్​, ట్రాఫిక్‌‌‌‌ జాయింట్‌‌‌‌ సీపీ, డీసీపీ   

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు : వాహనాల రద్దీతో ట్రాఫిక్​కష్టాలు ఎదురవుతున్న లక్డీకాపూల్‌‌‌‌ పరిసరాల్లో ట్రాఫిక్‌‌‌‌ సమస్యలకు చెక్‌‌‌‌ పెట్టేందుకు పోలీసులు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో కొత్తగా వన్‌‌‌‌వే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వన్‌‌‌‌వే అమలుకు ఉన్న అవకాశాలు, రోడ్ల పరిస్థితులు, వాహనాల రాకపోకలను శుక్రవారం హైదరాబాద్‌‌‌‌ సీపీ వీసీ సజ్జనార్‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌ జాయింట్‌‌‌‌ సీపీ డి జోయెల్‌‌‌‌ డేవిస్‌‌‌‌, డీసీపీ అవినాశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పరిశీలించారు. 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు ద్వారకా హోటల్‌‌‌‌, పాత సైఫాబాద్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, ఇక్బాల్‌‌‌‌ మినార్‌‌‌‌, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌‌‌‌ చౌరస్తా, ఓల్డ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ ప్రాంతాల్లో పర్యటించారు. ట్రాఫిక్‌‌‌‌ రద్దీ, వాహనాల మళ్లింపు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఇలా మళ్లిస్తారు..

ప్రతిపాదిత వన్‌‌‌‌వే విధానంలో ఓల్డ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్‌‌‌‌ మినార్‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలను నేరుగా అనుమతించకుండా హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, పాత సైఫాబాద్‌‌‌‌ పీఎస్‌‌‌‌, ఇక్బాల్‌‌‌‌ మినార్‌‌‌‌, సచివాలయం జంక్షన్‌‌‌‌ మీదుగా మళ్లించనున్నారు. నిరంకారీ జంక్షన్‌‌‌‌ నుంచి ఓల్డ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలను పాత సైఫాబాద్‌‌‌‌ పీఎస్‌‌‌‌ వద్ద మళ్లించి, ఇక్బాల్‌‌‌‌ మినార్‌‌‌‌ మీదుగా రవీంద్రభారతి వైపు పంపించేలా ప్రణాళికలు రూపొందించారు. 

అలాగే, సచివాలయం జంక్షన్‌‌‌‌, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌‌‌‌ నుంచి పాత సైఫాబాద్‌‌‌‌ పీఎస్‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్‌‌‌‌ మినార్‌‌‌‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లి, ఓల్డ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ వద్ద యూటర్న్‌‌‌‌ తీసుకుని అసెంబ్లీ గేట్‌‌‌‌ నంబర్‌‌‌‌ 3, రవీంద్రభారతి, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ మీదుగా చేరుకునేలా మార్గాలను ప్రతిపాదించారు. 

ఈ విధానం అమలుపై త్వరలోనే జీహెచ్‌‌‌‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌‌‌‌ శాఖలతో పాటు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా వన్‌‌‌‌వేను అమలు చేసి, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించిన తర్వాతే శాశ్వతంగా కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామని సీపీ తెలిపారు. నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ అవసరాన్ని బట్టి వన్‌‌‌‌వే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.


కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ మార్గంలో మరో లేన్‌‌‌‌ 

లక్డీకాపూల్‌‌‌‌ పర్యటన తర్వాత ఇప్పటికే వన్‌‌‌‌వే అమల్లో ఉన్న కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ మార్గాన్ని సీపీ సజ్జనార్​ పరిశీలించారు. బైక్‌‌‌‌పై  తిరుగుతూ ప్రస్తుత ట్రాఫిక్‌‌‌‌ పరిస్థితులను సమీక్షించారు. వాహనాల రాకపోకలు మరింత సాఫీగా సాగేందుకు ప్రస్తుతం ఉన్న వన్‌‌‌‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్‌‌‌‌ లేన్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

అక్కడ అడ్డంకిగా ఉన్న పైపులైన్లు, కరెంట్​స్తంభాలు, ఇతర యుటిలిటీలను తరలించేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ట్రాఫిక్‌‌‌‌ విభాగం, జీహెచ్‌‌‌‌ఎంసీ, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ పరిసరాల్లో ట్రాఫిక్‌‌‌‌ సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. నగరంలో ట్రాఫిక్‌‌‌‌ను శాస్త్రీయంగా క్రమబద్ధీకరించేందుకు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. 

ఐటీ కారిడార్​ పరిధిలోనూ.. పరిశీలించిన సీపీ, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్

గచ్చిబౌలి, వెలుగు :  ఐటీ కారిడార్​లో ..ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి బయోడైవర్సిటీ రూట్​లో ట్రాఫిక్ జామ్‌‌‌‌లకు చెక్​పెట్టేందుకు వన్-వే అమలు చేయనున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శుక్రవారం సైబరాబాద్ సీపీ రమేష్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌‌‌‌ప్రీత్ సింగ్, ఆర్టీసీ అధికారులు పర్యటించారు. బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా, టీ -వర్క్స్, క్వాల్‌‌‌‌కామ్, డల్లాస్ సెంటర్ రోడ్డు తదితర పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ప్రతిపాదిన వన్-వేలు రూట్​ ఇదే..

బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్, రోటరీ, టైమ్స్ స్క్వేర్ రోడ్డు, నాలెడ్జ్ సిటీ రోడ్డు, క్వాల్‌‌‌‌కామ్ - డల్లాస్ సెంటర్ రోడ్డు మీదుగా ఈ వన్-వే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం, బాటిల్ నెక్స్ (ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలు), సమస్యలు ఉత్పన్నమవుతున్న పాయింట్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అజెండా నోట్‌‌‌‌ను సిద్ధం చేయాలని ట్రాఫిక్​ అధికారులను సీపీ ఆదేశించారు.