- ఇప్పటివరకు చెరువులను ఆక్రమణల నుంచి విడిపిస్తున్న హైడ్రా
- ఇక నుంచి అభివృద్ధి, నిర్వహణకూడా అప్పగించే ప్లాన్ లో జీహెచ్ఎంసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లోని చెరువులను హైడ్రాకు అప్పగించాలని బల్దియా ఆలోచిస్తున్నది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని185 చెరువుల అభివృద్ధి, సంరక్షణ, నిర్వహణ బాధ్యతలను బల్దియా చూస్తోంది. అయితే, ఈ బాధ్యతలను హైడ్రాకి అప్పగించాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను డెవలప్ చేయాలని, సుందరీకరించాలని బల్దియా కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు జరగడం లేదు.
2022లో 47 చెరువులను రూ.161 కోట్లతో మూడు దశల్లో సుందరీకరించాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు వేసింది. అయినప్పటికీ, ఒక్క చెరువు పని కూడా చేయలేకపోయింది. చెరువుల చుట్టూ ఫెన్సింగ్, మురుగు నీటిని మళ్లించడం, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు వంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంపై బల్దియా కమిషనర్ కర్ణన్అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెరువుల అభివృద్ధి పనులను హైడ్రాకు అప్పగిస్తే, పనులు వేగంగా పూర్తవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది. హైడ్రా ఇప్పటికే నగరంలో ఆరు చెరువుల అభివృద్ధి పనులు చేపట్టగా, బతుకమ్క కుంట పనులు పూర్తయ్యాయి. ఈ అనుభవం గ్రేటర్ లోని అన్ని చెరువుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని బల్దియా అనుకుంటోంది.
హైడ్రా వేగం చూసి..
జీహెచ్ఎంసీలో లేక్స్ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా అధికారులు లేరు. దీంతో అడిషనల్ కమిషనర్ లేదా ఇంజినీర్లకు చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు అదనపు బాధ్యతలను అప్పగించాల్సి వస్తున్నది. ప్రస్తుతం కూడా చెరువులకు సంబంధించి స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ (ఎస్ఎన్డీపీ) చీఫ్ ఇంజనీర్ కే బాధ్యతలు ఇచ్చారు. అయితే వీరికి వారి సొంత విభాగంలోనే ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది.
దీంతో చెరువుల అంశంపై పెద్దగా దృష్టి పెట్టడంలేదు. కేవలం కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ కింద మాత్రమే కొన్ని చెరువులను సుందరీకరించారే తప్ప నేరుగా జీహెచ్ఎంసీ ఎక్కడ పనులు చేయలేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా అధికారులు కేవలం చెరువులపైనే వర్క్ చేస్తున్నారు. ఆక్రమణలను గుర్తించడం, తొలగించడంలో పాటు ఫెన్షింగ్వేస్తున్నారు.
అలాగే, ఆరు చెరువులను పైలట్ ప్రాజెక్టు కింద సుందరీకరిస్తున్నారు. ఇందులో ఇప్పటికే బతుకమ్మకుంట పనులు పూర్తికాగా సీఎం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే చెరువులను అప్పగిస్తే అభివృద్ధితో పాటు పరిరక్షణ కూడా ఉంటుందని హైడ్రాకు అప్పగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
త్వరలో కమిషనర్ల సమావేశం
చెరువలను హైడ్రాకు అప్పగించే అంశంపై త్వరలోనే జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ మీటింగులో చెరువుల బదిలీ, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత గ్రేటర్ లోని 185 చెరువుల బాధ్యతలను హైడ్రాకు అప్పగించే అవకాశముంది.
