దంచి కొడుతున్న వానలు.. వణుకుతున్న హైదరాబాద్​ ప్రజలు

దంచి కొడుతున్న వానలు.. వణుకుతున్న హైదరాబాద్​ ప్రజలు

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్​ చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు ప్రాంతాల  ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పాములు, విష  కీటకాలతో సావాసం చేయాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చిన్న చిన్న చెరువులు సరస్సులను తలపిస్తుండగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో హిమాయత్​ సాగర్, ఉస్మాన్​సాగర్​జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. గరిష్ఠ కెపాసిటీని చేరుకోవడంతో జలమండలి అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. 

సంగారెడ్డి జిల్లా పరిధి అమీన్​పుర్​ చెరువు సైతం నిండుకుండలా తోణికిసలాడుతోంది.  కుత్బుల్లాపూర్.. గాజులరామారంలోని బాలాజీ లే అవుట్, వోక్షిత ఎంక్లేవ్, ఆదర్శ్​ నగర్​ ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నాయి. 

తూముకు గండి..

గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఘట్కేసర్ మండలం ఎదులబాద్ లక్ష్మి నారాయణ చెరువు తూముకు గండి పడింది. దీంతో పొలాలన్నీ మునిగిపోయాయి. ఊళ్లోకి నీరు భారీగా ప్రవహిస్తుండడంతో  గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. 

మల్కాజిగిరి డీసీపీ జానకి ఎదులబాద్ లక్ష్మి నారాయణ చెరువును పరిశీలించారు.  ఇరిగేషన్ సూపర్ఇండెంట్ ఇంజినీర్ హైదర్ ఖాన్ మాట్లాడుతూ.. చెరువు తూముకు గండి పడిన చోట ఇసుక సంచులతో నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం  చెరువుకు సంబంధించిన గండి పూడ్చివేత పనులను పరిశీలిస్తున్నారు.

బియ్యం పంపిణీ చేసిన బీజేపీ నేత..

భారీ వర్షాలు బీఆర్​ఎస్​ పార్టీ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని బీజేపీ నేత బండ కార్తీక రెడ్డి ఆరోపించారు. ఆమె సికింద్రాబాద్​మొండి బండనగర్​లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ నేతలతో కలిసి స్థానికులకు బియ్యం పంపిణీ చేశారు. 

స్థానికంగా 40 కుటుంబాలు ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే ఒక్కరికి కూడా డబల్​బెడ్రూం ఇవ్వలేదని అన్నారు. ఎండకు, వానకు వారి అవస్థలు చూస్తుంటే సీఎం కేసీఆర్​కు కనికరం కలగట్లేదని అన్నారు. సమస్యల్ని ఎంపీ కిషన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు.