
- ఇటీవల సమస్య తలెత్తిన ప్రాంతాల్లో హైడ్రా, బల్దియా కమిషనర్ల పర్యటన
- ఫ్లైఓవర్లపై నీళ్లు వెళ్లే పైపుల గ్రిల్స్
- జామ్ అయ్యాయని గుర్తింపు
- 70 ఫ్లైఓవర్లపై నీళ్లు సాఫీగా వెళ్లేలా క్లీనింగ్ షురూ
- మెయిన్ రోడ్లపై నీళ్ల ఖాళీకి మోటార్ల ఏర్పాటు
- లాగింగ్ పాయింట్స్ వద్ద 4 శాఖల సిబ్బంది నియామకం.
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో వర్షం పడిందంటే చాలు బైక్ పైనో..కారులోనే రోడ్డెక్కాలంటే జనాలు వణికిపోతారు. రోడ్లపై నిలిచే నీటితో గంటలకు గంటలు రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కావడమే దీనికి కారణం. గత శుక్రవారం స్కూల్స్, ఆఫీసులు వదిలే సమయంలో వాన దంచి కొట్టడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి రోడ్లు బ్లాక్ అయిపోయాయి. దీంతో ఈ సమస్యపై హైడ్రా, బల్దియా కమిషనర్లతో పాటు ట్రాఫిక్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. చిన్నపాటి వాన పడిన కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో మళ్లీ రిపీట్ కాకుండా యాక్షన్ప్లాన్చేపట్టారు.
సెంటీమీటర్కంటే ఎక్కువ పడితే..
నగరంలో సెంటిమీటర్ కు మించి వాన పడితే రోడ్లపై నీరు చేరుతోంది. దీంతో మెయిన్రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ చౌరస్తా రౌల్వే అండర్ బ్రిడ్జి(ఆర్ యూ బీ) తో పాటు గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ గమన్ దవాఖాన వద్ద, ఆరాంఘర్ ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో వరద చేరి గంటల తరబడి ట్రాఫిక్ జామ్అయ్యింది. షేక్ పేట్, మాసబ్ ట్యాంక్, తెలుగుతల్లి , మూసాపేట్, గచ్చిబౌలి, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లతో పాటు ప్యాట్నీ నుంచి పంజాగుట్ట వరకు ఫ్లై ఓవర్లపై వెహికిల్ మూవ్ మెంట్ స్లో అయ్యింది.
ఆ ప్రాంతాలపైనే ఫోకస్
ముందుగా ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడిన ప్రాంతాలపై మూడు శాఖల అధికారులు ఫోకస్ పెట్టారు. ఫ్లైఓవర్లపై నీళ్లు నిలవడానికి కారణాలేంటని ఆరా తీశారు. ఫ్లైఓవర్ల పై నుంచి నీళ్లు సాఫీగా వెళ్లే గ్రిల్స్ లో మట్టి, చెత్త పేరుకుపోవడంతోనే సమస్య ఏర్పడిందని గుర్తించి క్లియర్ చేయించే పనులు మొదలుపెట్టారు. గ్రేటర్ లోని మొత్తం 70 ఫ్లైఓవర్లపై క్లీనింగ్ పనులను హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మొదలుపెట్టాయి.
అలాగే, గ్రేటర్ లోని141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా స్టాటిక్ టీమ్స్ తో పాటు ట్రాఫిక్, బల్దియా, వాటర్ బోర్డు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ప్రతి శాఖ నుంచి ఒక్కొక్కరి చొప్పున 141 ప్రాంతాల్లో సిబ్బంది వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటారు. రోడ్లపై చేరే నీటిని వెంట వెంటనే మోటర్ల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తారు.
లాగింగ్ పాయింట్ల పరిశీలన
వర్షపు నీరు చేరి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న ప్రాంతాలను బుధవారం బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ పరిశీలించారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్రాంతంలో నీరు నిలిచే ప్రాంతాలను ముగ్గురు అధికారులు పరిశీలించారు.
కొత్తగూడ చౌరస్తాలో ఇటీవల వరద నీరు నిలిచిన ఆర్ యూ బీ వద్ద తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు. వరద వచ్చినప్పుడు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సిబ్బందికి రంగనాథ్ సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ స్థానిక అధికారులతో ఆయా ప్రాంతాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.