వరదలతో ఇంట్లోకి పాములు...జాగ్రత్త ...అన్నీ విషనాగులే

వరదలతో ఇంట్లోకి పాములు...జాగ్రత్త ...అన్నీ విషనాగులే

వర్షాలు, వాటి వల్ల సంభవించే వరదలతో భయం గుప్పిట్లో బతుకుతున్న హైదరాబాద్ జనానికి మరో  పిడిగులాంటి వార్త.  బీభత్సమైన వర్షాల వల్ల  చెరువులు, రిజర్వాయర్లు, సరస్సులు పొంగిపొర్లుతుండటంతో  నగర శివారులో..  వాటి  పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి. భారీగా వరదలు ఇండ్లలోకి చేరుతుండటంతో..ఆ వరదల్లో పాములు కూడా ఇండ్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. 

పాములు వస్తున్నాయంటూ ఫిర్యాదు..

 భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర శివార్లలోని అనేక ఇళ్లు, కంపెనీలు, కర్మాగారాల్లోకి  వస్తున్న వరదల్లో  పాములు ఉన్నట్లు సమాచారం. వరదలతో పాటు తమ ఇండ్లలోకి పాములు వస్తున్నాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి పెద్ద ఎత్తున ఫిర్యాదు వస్తున్నాయి. గత ఐదు రోజుల్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు అనేక పాములను రక్షించారు. వీటిలో  నాగుపాములు, త్రాచుపాములు, చెకర్డ్ కీల్ బ్యాక్ వంటి విషపూరితమైనవి ఉన్నాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు తెలిపారు. 

పాములు ఎక్కడెక్కడ దాక్కుంటాయంటే..

ఇండ్లలోకి వరదలతో పాటు కొట్టుకొచ్చే పాములు.. ఇంటి కాంపౌండ్‌లోని చాటు ప్రదేశాల్లో తలదాచుకుంటాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు తెలిపారు. గొడల మధ్యలో, కట్టెల మధ్యలో, డోర్స్ లో,  ఇసుకలో, మట్టిలో దాక్కుంటాయని సూచిస్తున్నారు.  అయితే వరదల సమయంలో తలుపులను మూసివేయాలని..లేదంటే కొద్దిగా ఖాళీ ఉన్నా..ఇంట్లోకి వచ్చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 

ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పాములు ఉన్నాయంటే..

ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి రోజు దాదాపు 300 వరకు కాల్స్ వస్తాయి.  “కాల్ అందుకున్న తర్వాత స్థానిక వాలంటీర్లను స్పాట్‌కు పంపిస్తారు. అయితే హైదరాబాద్ లో  ప్రధానంగా బీరంగూడ, నిజాంపేట్, కూకట్‌పల్లి, షేక్‌పేట్, దమ్మాయిగూడ, లింగంపల్లి, పటాన్‌చెరు, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, నాగోల్, అత్తాపూర్, రాయదుర్గం, రాంపల్లి ప్రాంతాల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి.  ఈ సొసైటీలో సుమారు 150 మంది వాలంటీర్లు ఉన్నారు, వారు గత మూడు రోజుల్లో ఇప్పటి  వరకు 178 పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. వీటిల్లో దాదాపు సగం విషపూరితమైనవే.