
- గోవా, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీమ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో కొరియర్ ద్వారా డ్రగ్స్ ను డోర్ డెలివరీ చేస్తున్న ముఠా సభ్యుడు అన్నమనేని సూర్య (34)ను తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) టీమ్ అరెస్ట్ చేసింది. నిందితుడు కొంపల్లిలో ఉన్న మల్నాడు కిచెన్ రెస్టారెంట్ ఓనర్ అని..రెస్టారెంట్ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలింది. సూర్య నిషేధిత డ్రగ్స్‌తో తన రెస్టారెంట్ కు రాబోతున్నట్లు ఈగల్ టీమ్ కు సమాచారం అందింది. దాంతోవారు నార్కోటిక్స్ పోలీసులతో కలిసి మల్నాడు కిచెన్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు.
సూర్య తన టాటా స్కార్పియో ఎస్‌యూవీ కారులో రాగానే పోలీసులు అతడిని అడ్డగించారు. సూర్య కారులో తనిఖీ చేయగా డ్రగ్స్ దొరికాయి. శ్రీ మారుతి కొరియర్ పేరిట ఉన్న ప్యాక్ లోని గర్ల్స్ చెప్పుల హీల్ కంపార్ట్‌మెంట్ నుంచి 10 గ్రాముల కొకైన్, 1.6 గ్రాముల ఎక్సటసీ పిల్స్, 3.2 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎంబీఏ చేసి డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్‌గా మారి..
కొంపల్లికి చెందిన సూర్య బెంగళూరులో ఎంబీఏ (మార్కెటింగ్) పూర్తి చేశాడు. 2020లో కొంపల్లిలో మల్నాడు కిచెన్ రెస్టారెంట్‌ను స్థాపించాడు. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీలోని పబ్‌లలో కొకైన్, ఓజీ కుష్‌ను తీసుకునేవాడు. క్రమంగా అతనే పూర్తిస్థాయి డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్‌గా మారాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన హరీశ్, కరీంనగర్‌కి చెందిన సందీప్ జువ్వాడి, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్‌తో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. గోవా, బెంగళూర్, ఢిల్లీలోని నైజీరియన్ డ్రగ్ ట్రాఫికర్లు నిక్, జెర్రీ, డిజ్‌మండ్, స్లాన్లీ, ప్రిన్స్ వద్ద కొకైన్, ఎండీఎంఏ సహా ఇతర డగ్స్‌ను కొనుగోలు చేసేవాడు.
వాటిని హైదరాబాద్‌లోని డ్రగ్స్ కస్టమర్లకు ఆర్డర్ల వారీగా సప్లయ్ చేసేవాడు. తన రెస్టారెంట్‌తో పాటు సిటీలోని పబ్బులకు 20 సార్లకు పైగా కొకైన్ సప్లయ్ చేశాడు. ప్రముఖులకు డ్రగ్స్ డోర్ డెలివరీ చేసేవాడు. గోవాలోని నైజీరియన్ నిక్ వద్ద కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పేరుతో రూ.1.80 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడని అధికారులు వివరించారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు సూర్యను కస్టడీ కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.