కరాబైన రోడ్లు.. పొంగిన మ్యాన్​హోల్స్

కరాబైన రోడ్లు.. పొంగిన మ్యాన్​హోల్స్

హైదరాబాద్/నేరెడ్ మెట్/శంషాబాద్/ఎల్​బీనగర్, వెలుగు: సిటీలో ఐదు రోజులుగా పడుతున్న వానలకు రోడ్లు దెబ్బతిన్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం వాన కాస్త తెరిపినిచ్చినా.. చాలా కాలనీల్లో రోడ్లపై నీరు తొలగలేదు. మరో పక్క డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది.  రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్స్ ను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం నేరెడ్ మెట్ లోని కమిషనరేట్ ఆఫీసులో డీసీపీలు, ఏసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 

వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల జనాలను అలర్ట్ చేసి వారిని సేఫ్ ప్లేస్ కు తరలించాలన్నారు. కుషాయిగూడ, నేరెడ్​మెట్, మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో నాలాలు నిండిపొంగుతున్నాయి. మౌలాలి డివిజన్ పరిధిలో నాలాలో చనిపోయిన ఆవు కొట్టుకొచ్చింది.శంషాబాద్ నుంచి మల్కారం వెళ్లే రూట్​లో ఉన్న  కేపీదొడ్డి, సుల్తాన్ పల్లి, ఆమ్దాపూర్ లింక్ రోడ్లు గుంతలమయంగా మారాయి. ఐదేండ్ల కిందట మొదలైన మల్కారం నుంచి కేపీదొడ్డి వరకు కి.మీ దూరం రోడ్డు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నట్లు  కేపీదొడ్డి, మల్కారం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ  రోడ్లు దారుణంగా మారాయి. 

సరూర్ నగర్ చెరువు వరద, డ్రైనేజీ నీటితో ఆగమైన వీవీనగర్

సరూర్​నగర్ చెరువు నిండటంతో అధికారులు 6 గేట్లను ఓపెన్ చేసి  నీటిని కిందకు వదులుతున్నారు. అయితే, సరూర్​నగర్ చెరువు నుంచి వస్తున్న వరద కారణంగా దిగువన ఉన్న వీవీనగర్, కోదండరాంనగర్, కమలానగర్ కాలనీలు అతలాకుతలమయ్యాయి. కాలనీల రోడ్లు చెరువులుగా మారాయి. శుక్రవారం కాలనీవాసులు సుమారు 5 గంటల పాటు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 

కాలనీల్లో డ్రైనేజీ సైతం పొంగిపొర్లడంతో జనాలు ఇబ్బందిపడ్డారు. గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కాలనీలను సందర్శించారు. ఈ కాలనీల్లో బాక్స్ డ్రెయిన్, నాలా పనులు పూర్తి చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని వారు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులకు బదులు బీఆర్ఎస్ నేతలే తూము గేట్లు ఓపెన్ చేశారని ఆరోపించారు.  అనధికారికంగా గేట్లు ఎత్తిన వారిపై  కేసులు నమోదు చేయాలన్నారు.