హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్స్ టెస్ట్ : 100 మందికి పాజిటివ్ అంట..!

హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్స్ టెస్ట్ :  100 మందికి పాజిటివ్ అంట..!

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో డ్రగ్స్ వినియోగదారుల ఆటకట్టించేందుకు టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ పోలీసులు మరోసారి మెరుపు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు నగరంలోని రౌడీ షీటర్లు, అల్లరిమూకలు, పాత నేరస్తులకు ఆకస్మికంగా డ్రగ్ టెస్టులు చేసినట్లు టాస్క్ ఫోర్స్, డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు.

గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ ఆస్పత్రి వైద్యుల సహకారంతో మొత్తం 204 మందికి పరీక్షలు చేయగా, వారిలో 87 మంది మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. గత నెలలో కూడా 239 మందిని పరీక్షించగా 187 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.


గచ్చిబౌలి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 128 మంది రౌడీషీటర్లకు పరీక్షలు చేయగా, వారిలో 11 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందని ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్ తెలిపారు. జోన్ల వారీగా చూస్తే.. శేరిలింగంపల్లిలో 44 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి, కుత్బుల్లాపూర్​లో 59 మందికి గాను నలుగురికి, కూకట్‌‌‌‌పల్లిలో 28 మందిని పరీక్షిస్తే ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.