
- హైదరాబాద్ టెర్రరిస్టులకు షెల్టర్‌గా మారింది
- పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినవారూ ఇక్కడ ఉన్నారు
- మహిళలను గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు
- శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెడతాం
- రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా నిధులొచ్చాయి
- ఇక్కడి సర్కారు పథకాలుగా చూపి, ఖర్చు చేస్తున్నారని విమర్శ
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరణ.
ఢిల్లీ, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అక్రమంగా ఉంటున్న చొరబాటుదారులను పంపేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. పాకిస్తాన్ సహా పలు దేశాలకు చెందినవారికి హైదరాబాద్ షెల్టర్‌గా మారిపోయిందని, టెర్రరిస్టు దాడులకు కుట్రలూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. టెర్రరిస్టులు హైదరాబాద్‌ను వారికి సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమంగా ఉంటున్నవారిని పంపేసి, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెడతామని తెలిపారు. కిషన్‌రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన తాను.. ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపే విధంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు చేశారని, తనకు అందులో చోటు దక్కడంపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయంగా నిలుస్తం
గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సొమ్మను రాష్ట్ర పథకాలుగా మార్చి చూపుకొందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్నవాటిలో కేంద్ర ప్రభుత్వం చాలా అంశాలను అమలు చేసిందని, ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర సర్కారు నాలుగేళ్లుగా రేషన్ కార్డులు ప్రింటింగ్ చేయడం లేదని, వాటిపై కేంద్ర ప్రభుత్వ లోగో పెట్టాల్సి ఉండటమే అందుకు కారణమని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తం. 2023 నాటికి రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలుపుతం. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బలోపేతం చేస్తం. నన్ను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా. చౌకీదార్‌గా సేవలు అందిస్తా..” అని కిషన్‌రెడ్డి చెప్పారు.
కేంద్ర సహాయం అందిస్తం..
దేశంలోని పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటని, దేశంలోఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. టెర్రరిస్టులు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా భావిస్తున్నారని, ఎంతో మంది చొరబాటు దారులు అక్రమంగా ఉంటున్నారని చెప్పారు. మహిళలను ఇస్లామిక్ దేశాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటన్నింటిపై దృష్టి పెడతామని తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అయినా కేంద్ర సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
‘‘నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశాను. సీమా సురక్ష జాగరణ్ యాత్ర పేరిట 45 రోజుల పాటు దేశ సరిహద్దుల్లో తిరిగి చొరబాటు దారులను నియంత్రించడంపై అవగాహన కల్పించినం. ఇప్పుడు నాకు హోంశాఖ సహాయ మంత్రిగా చాన్స్ రావడం యాదృచ్చికం. అక్రమ వలసల వల్ల దేశంలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. ఈ చొరబాట్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. చొరబాటు దారులను దేశం నుంచి పంపించేయాలి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఉండాలి…” అని కిషన్‌రెడ్డి చెప్పారు.
కేసీఆర్‌కు జనం బుద్ధి చెప్పారు: కె.లక్ష్మణ్
లోక్‌సభ ఎలక్షన్లలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె-.లక్ష్మణ్ విమర్శించారు. అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచినప్పటి నుంచి కేసీఆర్, ఆయన కుమారుడి మాటలకు అంతు లేకుండా పోయింద ని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో సారు, కారు, పద హారు అన్నారు.. కానీ సారు, కారు, బేజారు అన్న పరిస్థితి వచ్చింది. బీజేపీ అనుకున్నదాని కంటే భారీగా ఓట్లు సాధించి, 4 చోట్ల గెలిచిం ది. ఇదే స్ఫూర్తితో 2023లో రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం . పార్టీలోకి వచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నాం ” అని చెప్పారు.