
జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఘోరంగా అవమానించి బయటికి పంపించారు. ఇంటి సమస్య విషయంలో దివ్యాంగుడు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఫిర్యాదుచేసేందుకు ప్రజావాణికి వచ్చారు. ఈ ఘటన సోమవారం(ఆగస్టు 11) జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు మర్రిపల్లి రాజ గంగారాం తన ఇంటి స్థలంలో అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని ఆవేదనతో చెందాడు. ఈ సమస్య పరిష్కారం కోసం అతను గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాడు.
ALSO READ : కీసర ORR పై ఘోర రోడ్డుప్రమాదం..
ఆగస్టు 4న గంగారాం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు నిరసన చేశాడు. స్పందిచిన కలెక్టర్ సత్యప్రసాద్ సహాయక అధికారులను ఘటనా స్థలానికి పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అయితే అధికారులు ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో గంగారాం మళ్లీ నిరాశగా వెనక్కి వెళ్లాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అతను మళ్లీ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.
ఘోర అవమానం
సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో గంగారాం తన వీల్‌చైర్‌లో అదనపు కలెక్టర్ ముందు తన సమస్యను వివరిస్తుండగా కలెక్టరేట్ సిబ్బంది అతన్ని బయటకు నెట్టేశారు. తాగి వచ్చాడని అతని వీల్‌చైర్‌తో సహా బయటకు పంపించారు. ఈ ఘోర అవమానం కలెక్టర్ సత్యప్రసాద్ సమక్షంలోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజల ఆగ్రహం
ఈ ఘటన సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజావాణి కార్యక్రమం సరిగా జరగడం లేదని అధికారులు దివ్యాంగులను కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, గంగారాంకు న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనతో అధికారుల నిర్లక్ష్యం, బాధితులకు అవమానం అనే అంశాలు తెరమీదికి వచ్చాయి. సమస్యను పరిష్కరించకుండా, బాధితుడిని అవమానించడం పట్ల కలెక్టర్ కార్యాలయం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.