హైదరాబాద్‌‌ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! ‌‌దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌‌...

హైదరాబాద్‌‌ లో ఇల్లు చాలా కాస్ట్లీ గురూ..! ‌‌దేశంలో మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌‌...
  • కుటుంబ ఆదాయంలో 41 శాతం హోమ్‌‌ లోన్ ఈఎంఐలకు పెట్టాల్సిందే 
  • టాప్‌‌లో ముంబై, ఢిల్లీ.. 65 శాతానికి పైగా ఈఎంఐలకు కట్టగలిగితేనే ఇల్లు
  • అత్యంత అఫార్డబుల్ సిటీలు అహ్మదాబాద్‌‌, కోల్‌‌కతా, పుణె
  • నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అత్యంత ఖరీదుగా మారింది.  ఇక్కడ ఇల్లు కొనాలంటే కుటుంబం తన ఆదాయంలో 41 శాతానికి పైగా నెల కిస్తీకి కట్టాలి. అంటే,  ఈ సిటీలో సొంతిల్లు కొని, ఈఎంఐల  కోసం ఆదాయంలో దాదాపు సగం వాటా కేటాయించాలన్న మాట.  

దేశంలోని టాప్ 8 సిటీలతో పోలిస్తే మూడో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌‌గా హైదరాబాద్‌‌ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.  ఈ సంస్థ తాజాగా  ‘అఫార్డబిలిటీ ఇండెక్స్‌‌’ను విడుదల చేసింది. దీని ప్రకారం రెపో రేటు  125 బేసిస్ పాయింట్ల (1.25శాతం) మేర తగ్గడంతో హోమ్‌‌ లోన్ల వడ్డీ రేట్లు దిగొచ్చాయి.  

ఇతర నగరాల్లో పరిస్థితులు ఇలా..

దేశంలో సర్వే చేసిన 8 ప్రధాన నగరాల్లో 6 నగరాల ప్రజలు ఇళ్లు కొనగల స్తోమత పరిధిలోనే (50శాతం లోపు) ఉన్నారు. అయితే ముంబై ,   ఢిల్లీ– ఎన్‌‌సీఆర్‌‌‌‌ మాత్రం 50శాతం పరిమితి కంటే ఎక్కువ శాతంతో, ఇళ్లు కొనడానికి అత్యంత భారంగా ఉన్న  నగరాలుగా కొనసాగుతున్నాయి. 

దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఇళ్లు దొరికే నగరంగా  అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ ఒక కుటుంబం ఆదాయంలో కేవలం 23శాతం మాత్రమే ఈఎంఐకి సరిపోతుంది.   25శాతంతో  కోల్‌‌కతా రెండో స్థానంలో,  28శాతంతో పుణె మూడో స్థానంలో ఉన్నాయి.

గత పదేళ్లలో పరిస్థితి ఇలా....

గత పదేళ్లలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్లు కొనే స్తోమత నిరంతరం మెరుగుపడుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్‌‌‌‌బీఐ  రెపో రేటును పదేళ్ల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించడంతో ఇళ్లు కొనడం మరింత సులువైంది. తదనంతరం ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) కారణంగా, మే 2022 నుంచి తొమ్మిది నెలల్లో రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో 2022లో ఇళ్లు కొనడం భారంగా మారింది. 

2023 ప్రారంభం నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరగడం వల్ల ముఖ్యంగా ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల కొనుగోలు భారం ఎక్కువగా నమోదైంది. ఇటీవల ఆర్‌‌బీఐ వడ్డీ రేట్లను మొత్తంగా 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో హోమ్ లోన్ ఈఎంఐల భారం దిగొచ్చింది.  

"రెసిడెన్షియల్  మార్కెట్ వృద్ధి చెందడానికి ప్రజల కొనుగోలు శక్తి అత్యంత కీలకమైనది. తక్కువ వడ్డీ రేట్లు ఉండడంతో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతాయని నమ్ముతున్నాం. గత ఏడాదితో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలు శక్తిపై కొంత ప్రభావం ఉంది’ అని రిపోర్ట్​ తెలిపింది.