చిన్నారుల గుండెకు ‘సంజీవని’ అండ : సినీహీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్రావు 

చిన్నారుల గుండెకు ‘సంజీవని’ అండ : సినీహీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్రావు 

సిద్దిపేట, వెలుగు :  సత్యసాయి బాబా లాంటి గొప్ప వ్యక్తులు ప్రేమ, దయతో తీసుకున్న నిర్ణయాలు పేదల జీవితాల్లో పెను మార్పులకు దొహదపడ్డాయని, అందులో భాగంగా ఏర్పాటైన శ్రీ సత్య సాయి సంజీవని ఆస్పత్రి చిన్నారుల గుండెలకు అండగా నిలుస్తోందని సినీ హీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె ఆపరేషన్లు పూర్తి చేసిన సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సత్యసాయి బాబా ఉచిత విద్యా సంస్థల వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే హరీశ్​రావు చొరవతో తెలంగాణలో ఈ ఆస్పత్రి ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా చిన్నారుల గుండెలకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తూ పునర్జన్మ నిస్తున్న వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని అభినందించారు.

మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు గుండె సమస్య ఉందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు పడే వేదనను దూరం చేస్తూ, ఈ ఆస్పత్రి కేవలం ఒక చిన్నారి ప్రాణాన్నే కాకుండా ఆ తల్లిదండ్రుల గుండెలను కూడా కాపాడుతోందని గుర్తుచేశారు. సమాజంలో పదవులు, ఆస్తుల కంటే తోటివారికి చేసే సేవలే శాశ్వతంగా నిలుస్తాయన్నారు.  ఆస్పత్రి సేవలపై తనకున్న అంకితభావానికి నిదర్శనంగా తన ఒక ఏడాది జీతాన్ని ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆస్పత్రిని విజయవంతంగా నడిపిస్తున్న చైర్మన్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశంసించారు. అంతకుముందు విజయ్ దేవరకొండ, హరీశ్​రావు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్న చిన్నారులను పరామర్శించి, వారికి పండ్లు, సర్టిఫికెట్లను అందజేశారు.0