అమెరికాలో కిడ్నాపైన హైదరాబాద్ స్టూడెంట్ మృతి

అమెరికాలో కిడ్నాపైన హైదరాబాద్ స్టూడెంట్ మృతి
  • డ్రగ్స్, కిడ్నీ రాకెట్  ముఠా చంపి ఉంటుందని అనుమానం
  • గత నెల 7న  క్లీవ్​లాండ్​ సిటీలో కిడ్నాప్
  • నెల రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు 

సికింద్రాబాద్, వెలుగు: అమెరికాలో నెల రోజుల కింద కిడ్నాప్​కు గురైన హైదరాబాద్  నాచారానికి చెందిన​ మహ్మద్​ అబ్దుల్​ అర్ఫత్  (25) మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్​లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించింది. అర్ఫత్ ​ఆచూకీ కోసం గాలింపు​ జరుగుతుండగానే అతడి డెడ్​బాడీ  క్లీవ్​లాండ్​లోని ఓ చెరువులో  లభించిందని ఇండియా ఎంబసీ తెలిపింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపింది. 

అర్ఫత్​మృతిపై  దర్యాప్తు చేస్తున్నామని, డెడ్​బాడీని భారత్ కు పంపించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నామని ఇండియా ఎంబసీ తెలిపింది.  అతడిని కిడ్నాప్​ చేసిన ముఠా.. హత్య  చేసి నీటిగుంటలో పడేసి ఉండవచ్చని, అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించింది. 

ఉన్నత చదువుల కోసం వెళ్లి 

మేడ్చల్​ జిల్లా  నాచారం ఎర్రకుంట అంబేద్కర్​ నగర్​లో  మహ్మద్​ సలీం కుటుంబం నివాసముంటోంది. అతని కొడుకు మహ్మద్​ అబ్దుల్​ అర్ఫత్​ (25)  హైదరాబాద్ లో డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నిరుడు మే నెలలో అమెరికా వెళ్లాడు. అక్కడ ఓహియో స్టేట్ లోని క్లీవ్ ల్యాండ్  సిటీలో ఉంటూ పీజీ చదువుతున్నాడు. రోజూ తన తండ్రితో ఫోన్​లో  మాట్లాడడం అర్ఫత్  కు అలవాటు. 

అయితే,​ మార్చి 7 నుంచి అతను తన తండ్రికి అందుబాటులో లేకుండా పోయాడు. తండ్రి సలీం.. అర్ఫత్ కు ఎన్నిసార్లు ఫోన్ ​చేసినా  స్విచాఫ్​ అని  వచ్చింది. దీంతో ఆందోళనకు గురయిన తండ్రి సలీం​.. అమెరికాలోని తమ బంధువులకు సమాచారం అందించాడు. అర్ఫత్  కనిపించడం లేదని గత నెల18న సలీం బంధువులు చికాగోలోని ఇండియన్​ కాన్సులేట్​కు ఫిర్యాదు చేశారు. 

దీంతో క్లీవ్​లాండ్  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మార్చి 19న  అర్పత్​ తండ్రి  సలీంకు అమెరికా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​ చేశారు. ‘‘మేము డ్రగ్స్​ ముఠాకు చెందిన వారం. నీ కొడుకును కిడ్నాప్​  చేశాం. వెంటనే 1200 డాలర్లు పంపాలి. లేకపోతే నీ కొడుకు కిడ్నీ అమ్మేసి చంపేస్తాం” అని కిడ్నాపర్లు బెదిరించారు. అయితే, ఈ డబ్బులు డిమాండ్​ చేసిన ముఠా.. వాటిని  ఎక్కడకు పంపాలి, ఎలా పంపాలనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. 

దీంతో భయాందోళనకు గురైన సలీం..  విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్​కు లేఖ రాశారు. విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందుకున్న అమెరికాలోని భారత ఎంబసీ స్థానిక పోలీసులతో కలిసి అర్ఫత్ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. పోలీసులు కూడా అర్ఫత్  ఆచూకీపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. మరోవైపు సలీం.. బీజేపీ నేత బండ కార్తీక రెడ్డి ద్వారా కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసి తన కొడుకు  కిడ్నాప్​ విషయం గురించి తెలిపాడు. వెంటనే మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.అమెరికాలోని భారత ఎంబసీకీ లెటర్ రాశారు. 

అర్ఫత్​ ఆచూకీ గుర్తించాలని కోరారు. ఒకవైపు బాధితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే సోమవారం క్లీవ్ ల్యాండ్  సిటీలోని ఒక సరస్సులో అర్ఫత్​ మృతదేహం లభ్యమయింది. అతని నడుముకి  పాస్ పోర్టు, మొబైల్  ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పోలీసులు పరిశీలించి అర్ఫత్  మృతదేహంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని బాడీని హైదరాబాద్  పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇండియా ఎంబసీ అధికారులు తెలిపారు.