ఢిల్లీపై 88 పరుగుల‌ తేడాతో హైదరాబాద్ గ్రాండ్‌ విక్టరీ

ఢిల్లీపై 88 పరుగుల‌ తేడాతో హైదరాబాద్ గ్రాండ్‌ విక్టరీ

సాహో.. సాహా

ప్లే ఆఫ్ ఆశలు సజీవం

దంచికొట్టిన వార్నర్‌, పాండే

తిప్పేసిన రషీద్​ ఖాన్​

నాకౌట్‌‌ రేస్‌‌లో నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ చెలరేగిపోయింది..! వృద్ధిమాన్‌‌ సాహా (45 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87), డేవిడ్‌‌ వార్నర్‌‌ (34 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66), మనీశ్‌‌ పాండే (31 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 44 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. భారీ స్కోరు సాధించింది..! బౌలింగ్‌‌లోనూ రషీద్‌‌ (3/7) మ్యాజిక్‌‌ చేయడంతో .. బలమైన ఢిల్లీని నిలువరించింది..! టెక్నికల్‌‌గా ప్లే ఆశలను సజీవంగా ఉంచుకున్న హైదరాబాద్‌‌ నెట్‌‌ రన్‌‌రేట్‌‌ను భారీగా పెంచేసుకుని.. ఇతర జట్లకు సవాలు విసురుతోంది..!!

దుబాయ్‌‌: ఒకరు కాదు… ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హైదరాబాద్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ చేసిన పరుగుల సునామీలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కొట్టుకుపోయింది. వీళ్లను కట్టడి చేయలేక ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేసిన మ్యాచ్‌‌లో వార్నర్‌‌ సేన కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ 88 రన్స్‌‌ తేడాతో ఢిల్లీని ఓడించి ప్లే ఆఫ్స్‌‌ రేస్‌‌లో నిలిచింది.  ముందుగా హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 రన్స్‌‌ చేసింది. తర్వాత ఢిల్లీ 19 ఓవర్లలో 131 రన్స్‌‌కే ఆలౌటైంది. రిషబ్‌‌ పంత్‌‌ (35 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 36) టాప్‌‌ స్కోరర్‌‌.  సాహాకు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది.

వార్నర్‌‌ విధ్వంసం

టాస్‌‌ గెలిచి ఫీల్డింగ్‌‌ తీసుకుని ఎంత తప్పు చేసిందో ఢిల్లీకి పవర్‌‌ప్లేలోనే తెలిసొచ్చింది. ఆరంభంలో సాహా బౌండ్రీలతో దూకుడు చూపెడితే.. అశ్విన్‌‌ వేసిన మూడో ఓవర్‌‌లో స్క్వేర్‌‌ లెగ్‌‌లో సిక్స్‌‌తో వార్నర్‌‌ విధ్వంసం మొదలైంది. ఈ ఓవర్‌‌లో 13 రన్స్‌‌ రాగా, తర్వాతి ఓవర్‌‌లో వార్నర్‌‌ 4, 4తో మళ్లీ 13 రన్స్‌‌ రాబట్టాడు. ఐదో ఓవర్‌‌లో అక్షర్​ పటేల్‌‌ ఒక్క బౌండ్రీయే ఇచ్చినా.. ఆరో ఓవర్‌‌లో రబాడ బౌలింగ్‌‌ను డేవిడ్‌‌ చీల్చి చెండాడు. 4, 4, 6, 4, 4తో ఏకంగా 22 రన్స్‌‌ దంచడంతో పవర్‌‌ప్లేలో హైదరాబాద్‌‌ 77/0 స్కోరు చేసింది.

ఈ సీజన్‌‌లో పవర్‌‌ప్లేలో ఇదే హయ్యెస్ట్‌‌ స్కోరు కావడం విశేషం. రెండు ఎండ్‌‌ల నుంచి స్పిన్నర్లు దిగినా.. వార్నర్‌‌ జోరు ముందు నిలువలేకపోయారు. సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో పాటు వీలైనప్పుడల్లా ఫోర్లు బాదుతూ 25 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. ఫలితంగా 9 ఓవర్లలోనే ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ స్కోరు 100 దాటేసింది. ఈ క్రమంలో 10వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ (1/35) బాల్‌‌ను రోప్‌‌ దాటించిన వార్నర్‌‌.. మూడో బాల్‌‌ను ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లోకి లేపాడు. కానీ లైన్‌‌ మిస్‌‌ కావడంతో అక్షర్​ చేతికి చిక్కాడు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 107 పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది.

సాహా.. దూకుడు

వార్నర్‌‌ ఔటైనా.. సాహా మాత్రం దూకుడు కొనసాగించాడు. 107/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన పాండే  టచ్‌‌లోకి రావడానికి టైమ్‌‌ తీసుకున్నాడు. 11వ ఓవర్‌‌లో రెండు ఫోర్లతో 14 రన్స్‌‌ రాబట్టిన సాహా.. 27  బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్​ వేసిన 12వ ఓవర్‌‌లో 6, 4తో మళ్లీ 15 రన్స్‌‌ కొట్టాడు. రబాడ వేసిన తర్వాతి ఓవర్‌‌లో సిక్స్‌‌, ఫోర్‌‌తో 14 రన్స్‌‌ బాదడంతో స్కోరు 156/1కి చేరింది. ఏ బౌలర్‌‌ దిగినా.. కచ్చితంగా బౌండరీ ఉండాల్సిందేనన్న రీతిలో ఆడిన సాహాకు 15వ ఓవర్‌‌లో అడ్డుకట్ట పడింది.

అన్రిచ్​  మూడో బాల్‌‌కు భారీ షాట్‌‌కు ప్రయత్నించి మిడాఫ్‌‌లో అయ్యర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా 15 ఓవర్లలో హైదరాబాద్‌‌ 175/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అప్పటివరకు ధారాళంగా రన్స్‌‌ ఇచ్చిన ఢిల్లీ బౌలర్లు లాస్ట్‌‌ ఐదు ఓవర్ల (44 రన్స్‌‌)లో ఒక్కసారిగా పుంజుకున్నారు. కొత్తగా వచ్చిన విలియమ్సన్‌‌ (11 నాటౌట్‌‌)తో పాటు పాండేను కూడా కట్టడి చేశారు. స్టోయినిస్‌‌, అన్రిచ్​, రబాడ పకడ్బందిగా బంతులు వేస్తూ భారీ షాట్లకు చాన్స్‌‌ ఇవ్వలేదు. దీంతో 16వ ఓవర్‌‌లో ఆరు రన్స్‌‌ మాత్రమే రాగా, 17వ ఓవర్‌‌లో పాండే 4, 4, 6తో 15 రన్స్‌‌ కొట్టాడు. కానీ లాస్ట్‌‌ మూడు ఓవర్లలో 6, 10, 7 పరుగులే రావడంతో స్కోరుకు కళ్లెం పడింది. మూడో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జతకావడంతో స్కోరు 200లు దాటింది.

క్యూ కట్టారు..

కళ్ల ముందు భారీ టార్గెట్‌‌ ఉన్నా.. ఢిల్లీ బ్యాట్స్‌‌మెన్‌‌ వికెట్లను కాపాడుకోలేకపోయారు. వరుస విరామాల్లో ధవన్‌‌ (0), స్టోయినిస్‌‌ (5) ఔట్‌‌కావడంతో ఢిల్లీ 14 రన్స్‌‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్‌‌లో రహానె (26), హెట్‌‌మయర్‌‌ (16) నిలకడగా ఆడారు. ఆరో ఓవర్‌‌లో హెట్‌‌మయర్‌‌ 20 రన్స్‌‌ పిండుకోవడంతో పవర్‌‌ప్లేలో ఢిల్లీ 54/2 కు చేరింది. కానీ ఏడో ఓవర్‌‌లో రషీద్‌‌ డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో హెట్‌‌మయర్‌‌, రహానెను ఔట్‌‌ చేయడంతో  మూడో వికెట్‌‌కు 40 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక రిషబ్‌‌ పంత్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (7) ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే రన్‌‌రేట్‌‌ తగ్గడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఢిల్లీ 73/4 స్కోరు చేసింది. తర్వాత కూడా హైదరాబాద్‌‌ బౌలర్లు లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌కు కట్టుబడటంతో ఢిల్లీ ప్లేయర్లు రన్స్‌‌ వేటలో వెనుకబడ్డారు. వరుస ఓవర్లలో అయ్యర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌ (1) ఔట్‌‌కావడంతో చేయాల్సిన రన్‌‌రేట్‌‌ భారీగా పెరిగిపోయింది. కాసేపటికే రబాడ (3), పంత్‌‌, అశ్విన్‌‌ (7), అన్రిచ్​ (1) కూడా వెనుదిరగడంతో ఢిల్లీకి భారీ ఓటమి తప్పలేదు.

శంకర్‌‌, సాహాకు గాయాలు!

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ను గాయాలు వెంటాడుతున్నాయి. మిచెల్‌‌ మార్ష్‌‌, భువనేశ్వర్‌‌ కుమార్‌‌ ఇప్పటికే లీగ్‌‌కు దూరమవగా కేన్‌‌ విలియమ్సన్‌‌ ఇంజ్యురీ నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు మరో ఇద్దరు ప్లేయర్లు ‘ఇంజ్యురీ’ లిస్ట్‌‌లో చేరనున్నారు. సీజన్‌‌లో ఫస్ట్‌‌ టైమ్​ బరిలోకి దిగి బ్యాటింగ్‌‌లో దుమ్మురేపిన వృద్ధిమాన్‌‌ సాహాతో పాటు ఫామ్‌‌లో ఉన్న ఆల్‌‌రౌండర్‌‌ విజయ్‌‌ శంకర్‌‌ గాయపడ్డాడు. బ్యాటింగ్‌‌ చేస్తుండగా కండరాల నొప్పితో సాహా ఇబ్బంది పడ్డాడు.

దాంతో, అతను కీపింగ్‌‌కు దూరంగా ఉండగా.. శ్రీవత్స్‌‌ గోస్వామి సబ్‌‌స్టిట్యూట్‌‌ కీపర్‌‌గా వచ్చాడు. ఇక, ఢిల్లీ ఇన్నింగ్స్‌‌ 12వ ఓవర్లో బౌలింగ్‌‌ చేస్తుండగా.. విజయ్ శంకర్‌‌కు గాయమైంది. ఎడమ కాలు కండరాలు పట్టేయడంతో ఆ ఓవర్‌‌  కంప్లీట్‌‌ చేయకుండానే అతను గ్రౌండ్‌‌ వీడాడు. మిగిలిన ఒక బాల్‌‌ను కెప్టెన్‌‌ వార్నర్‌‌ వేశాడు. సాహా, విజయ్‌‌ గాయాలపై సన్‌‌రైజర్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

హైదరాబాద్‌ బ్యాటింగ్‌: వార్నర్‌‌ (సి) పటేల్‌‌ (బి) అశ్విన్‌‌ 66, సాహా (సి) అయ్యర్‌‌ (బి) అన్రిచ్‌‌ 87, మనీశ్‌‌ (నాటౌట్‌‌) 44, విలియమ్సన్‌‌ (నాటౌట్‌‌) 11,

ఎక్స్‌‌ట్రాలు: 11

మొత్తం: 20 ఓవర్లలో 219/2

వికెట్ల పతనం: 1–107, 2–170. బౌలింగ్‌‌: నోర్జ్‌‌ 4–0–37–1, రబాడ 4–0–54–0, అశ్విన్‌‌ 3–0–35–1, పటేల్‌‌ 4–0–36–0, దేశ్‌‌పాండే 3–0–35–0, స్టోయినిస్‌‌ 2–0–15–0.

ఢిల్లీ బ్యాటింగ్: రహానె (ఎల్బీ) రషీద్‌‌ 26, ధవన్‌‌ (సి) వార్నర్‌‌ (బి) సందీప్‌‌ 0, స్టోయినిస్‌‌ (సి) వార్నర్‌‌ (బి) నదీమ్‌‌ 5, హెట్‌‌మయర్‌‌ (బి) రషీద్‌‌ 16, రిషబ్‌‌ పంత్‌‌ (సి) (సబ్‌‌) గోస్వామి (బి) సందీప్‌‌ 36, శ్రేయస్‌‌ (సి) విలియమ్సన్‌‌ (బి) శంకర్‌‌ 7, అక్షర్‌‌ (సి) (సబ్‌‌) గార్గ్‌‌ (బి) రషీద్‌‌ 1, రబాడ (బి) నటరాజన్‌‌ 3, అశ్విన్‌‌ (సి) సమద్‌‌ (బి) హోల్డర్‌‌ 7, దేశ్‌‌పాండే (నాటౌట్‌‌) 20, నోర్జ్‌‌ (సి) (సబ్‌‌) గార్గ్‌‌ (బి) నటరాజన్‌‌ 1,

ఎక్స్‌‌ట్రాలు: 9

మొత్తం: 19 ఓవర్లలో 131 ఆలౌట్‌‌

వికెట్ల పతనం: 1–1, 2–14, 3–54, 4–55, 5–78, 6–83, 7–103, 8–103, 9–125, 10–131. బౌలింగ్‌‌: సందీప్‌‌ 4–0–27–2, నదీమ్‌‌ 1–0–8–1, హోల్డర్‌‌ 4–0–46–1, రషీద్‌‌ 4–0–7–0, నటరాజన్‌‌ 4–0–26–2, శంకర్‌‌ 1.5–0–11–1, వార్నర్‌‌ 0.1–0–2–0.