- నాలుగు ఎయిర్ గన్లు, ఒక లైసెన్స్ డ్ రైఫిల్..
- 20 తూటాలు, స్కార్పియో కారు స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, నారాయణపేట మక్తల్ అటవీప్రాంతాల్లో ఎయిర్ గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, కముజు పిట్టలు, పావురాలను వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ కమిషనర్ (గోల్కొండ టీమ్), అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేటాడుతూ తీసుకున్న వీడియోలు ఉన్న ఫోన్లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అందె శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ అలీజా కోట్ల ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముజాఫర్ హుస్సేన్ అలియాస్ గుడ్డు(42), అబ్దుల్లా బిన్ సహైన్(27), మసూద్ బిన్ మహమ్మద్(43), జడ్చర్ల ప్రాంతానికి చెందిన విద్యార్థి మీర్ అహ్మద్ అమీర్(27), మొఘల్ పురా ప్రాంతానికి చెందిన సౌద్ బిన్ మహమ్మద్ బలాబ్(41), మక్తల్ ప్రాంతానికి చెందిన కె. శేఖర్(38) కలిసి మక్తల్ ప్రాంతంలోని వన్యప్రాణులను వేటాడడం అలవాటుగా మార్చుకున్నారు.
కావలి శేఖర్ అడవిలో వన్యప్రాణుల సమాచారం ఇస్తుండగా, వీరంతా కలిసి ఏడాదిగా షాద్‌నగర్, మక్తల్ అటవీప్రాంతంలో నెమళ్లు, జింకలను ఎయిర్ గన్లతో కాల్చి చంపి వాటి మాంసాన్ని వండుకుని తినేవారు. జంతువుల చర్మం, తలలు, ఇతర అవశేషాలను జూరాల బ్యాక్ వాటర్ కాలువలో పడేసేవారు. మీర్ అహ్మద్ అమీర్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్లో షూటర్ కాగా, తన వద్ద ఉన్న లైసెన్స్డ్ ఆయుధాన్ని వేట కోసం ఉపయోగించేవాడు.
నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి హైదరాబాద్ ఈస్ట్ రేంజ్ ఎఫ్ఆర్వోకు అప్పగించారు. వారి నుంచి 4 ఎయిర్ గన్లు, ఒక లైసెన్స్డ్ స్పోర్టింగ్ రైఫిల్, 20 బుల్లెట్లు. స్కార్పియో కారు, 8 మొబైల్ ఫోన్లు, కత్తి, ఎయిర్ గన్ పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
