
హైదరాబాద్ లో కరాచీ బేకరీ గురించి తెలియని వారుండరు.. కరాచీ బేకరీలో దొరికే బిస్కెట్స్ దగ్గర నుంచి చాక్లెట్స్, కేక్స్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. లాంటి కరాచీ బ్రాండ్ ని వాడుకొని జనాన్ని మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కరాచీ పేరుతో ఫేక్ ప్రొడక్ట్స్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు దుండగులు. బుధవారం ( అక్టోబర్ 1 ) హైదరాబాద్ బండ్లగూడలో ఫేక్ కరాచీ ప్రొడక్ట్స్ దందా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా హిల్స్, గౌస్ నగర్ ఫేక్ కరాచీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పక్కా సమాచారంతో ఫేక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ పై దాడి చేసిన పోలీసులు నిర్వాహకుడిని అరెస్ట్ చేసి.. రూ. ఐదు లక్షల విలువ చేసే ఫేక్ కరాచీ మెహేంది కోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
దందా నిర్వాహకుడు మొహమ్మద్ అబ్దుల్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని దగ్గర నుంచి నకిలీ కరాచీ మెహెంది కోన్‌లు, 10,800 కార్టన్ బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.