హైదరాబాద్ లో కొత్త కార్పొరేషన్ల హవా.. ఏప్రిల్ 3 నుంచి ఎవరి పాలన వారిదే

హైదరాబాద్ లో కొత్త కార్పొరేషన్ల హవా.. ఏప్రిల్ 3 నుంచి ఎవరి పాలన వారిదే
  • మార్చి 31 అర్ధరాత్రి నుంచి  ఎవరి ఆదాయం వారి ఖాతాల్లోనే
  • అప్పులపై ప్రభుత్వం నుంచి నో క్లారిటీ 
  • ఎప్పటిలాగే చెల్లించనున్న  జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు :  వచ్చేనెల నుంచి మూడు కార్పొరేషన్లలో పూర్తిగా సపరేట్ పాలన మొదలుకానున్నది. ఇప్పటికే మూడుచోట్ల వేరువేరుగా పాలన జరుగుతున్నప్పటికీ ఆర్థికపరంగా అన్ని బాధ్యతలు జీహెచ్ఎంసీనే చూస్తోంది. మార్చి నెల వరకు సీఎంసీ, ఎంఎంసీల జీతాలు కూడా జీహెచ్ఎంసీనే అందజేసింది.

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానున్న నేపథ్యంలో కీలకమైన రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల విభజన కూడా దాదాపు పూర్తి చేశారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కార్పొరేషన్లు ఆర్థికంగానూ స్వతంత్రంగా వ్యవహరించనున్నాయి.

ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించిన ఫీజులు ఆయా కార్పొరేషన్ల ఖాతాల్లోనే జమకానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సాఫ్ట్​వేర్ మార్పులు, బ్యాంక్ ఖాతాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పుల విభజన అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున, మిగిలిన అన్ని బాధ్యతలు కొత్త కార్పొరేషన్లు స్వయంగా నిర్వహించుకునేలా పనులు చేశారు.  

జీహెచ్ఎంసీపైనే అప్పులు.

జీహెచ్‌‌‌‌ఎంసీపై ఉన్న అప్పుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రూ.6,530 కోట్లలో రూ.4,876 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ అప్పులను ప్రభుత్వమే చెల్లిస్తుందని పలువురు అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటివరకైతే క్లారిటీ రాలేదు.

అప్పటివరకు అప్పుల భారం జీహెచ్‌‌‌‌ఎంసీపైనే ఉండనున్నది. స్పష్టత వచ్చే వరకు జీహెచ్ఎంసీ నుంచే కిస్తీలు చెల్లిస్తారు. వారంలో క్లారిటీ రాకపోతే వచ్చే నెల చెల్లించాల్సిన రూ.110 కోట్లను జీహెచ్‌‌‌‌ఎంసీనే కట్టాలి.