- 1,450 చ.కి.మీ. నుంచి 2,053 చ.కి.మీ కు విస్తరణ
- 2047 అవసరాలకు అనుగుణంగా ప్లాన్
హైదరాబాద్సిటీ, వెలుగు: బల్దియా పరిధిని ఓఆర్ఆర్వరకూ విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో వాటర్ బోర్డును కూడా మెగా వాటర్ బోర్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకూ ఓఆర్ఆర్ వరకూ సేవలందిస్తున్న వాటర్బోర్డు త్వరలో కోర్అర్బన్ఏరియా (ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాల వరకు)కూ సేవలను విస్తరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
బల్దియా విస్తరించే ప్రాంతాల వరకు తాగునీరు, డ్రైనేజీ సిస్టమ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వాటర్ బోర్డు ఓఆర్ఆర్ వరకు1450 చ.కి.మీ పరిధిలో ఉండగా, మరికొద్ది నెలల్లో మరో 603 చ.కి.మీ వరకూ విస్తరించనున్నది. ఈ పనులకు డీపీఆర్ రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు 3 నెలల్లో కన్సల్డెన్సీని ఎంపిక చేసి టెండర్లను పిలవనుందని సమాచారం.
850 ఎంజీడీలు అవసరం
ఇప్పటికే ఓఆర్ఆర్వరకూ విస్తరించిన వాటర్బోర్డు ఆయా ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు రోజుకు 550 ఎంజీడీలు సరఫరా చేస్తోంది. కొత్తగా ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాల్లోకి సేవలు విస్తరిస్తే ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా రోజుకు 850 ఎంజీడీలు సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే గోదావరి సెకండ్ఫేజ్పనులను ప్రారంభించింది.
2047 లక్ష్యంగా ముందుకు..
2047 నాటికి నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్బోర్డు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్బోర్డు సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో కొన్ని మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ లోపల ఉండగా, మరికొన్ని వెలుపల ఉన్నాయి. బల్దియాలో కలవబోతున్న ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో ఇప్పటికే బోర్డు నీటి సరఫరా చేస్తోంది.
అలాగే, కొన్ని పంచాయతీల పరిధిల్లోనూ సేవలందిస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ వెలుపలున్న కోర్అర్బన్ ప్రాంతాలన్నీ కూడా బోర్డు పరిధిలోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలకు తాగునీటితో పాటు, మురుగునీటి వ్యవస్థను కూడా వాటర్బోర్డు నిర్వహించనుంది. మురుగునీటి శుద్ధికి అవసరమైన ఎస్టీపీలను కూడా కొత్తగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
