ట్రాఫిక్ సిగ్నళ్లు అన్నీ ఇంటిగ్రేట్ చేయండి

ట్రాఫిక్ సిగ్నళ్లు అన్నీ  ఇంటిగ్రేట్ చేయండి
  •     వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ట్రాఫిక్‌‌ను నియంత్రించాలి
  •     అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 
     
  •     సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ వినియోగం 
  •     అనలాగ్, మేఘా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
  •     హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టుపై ప్రతినిధుల ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్‌‌‌‌ను క్రమబద్ధీకరించేలా, రద్దీ ఆధారంగా సిగ్నల్స్ పనిచేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీకి అనుసంధానించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌ఆర్‌‌డీలోని బోధి పెవిలియన్‌‌లో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌‌మాన్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి సీఎంతో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనలాగ్, మేఘా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

భవిష్యత్ తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు, ఫిజికల్ ఇంటెలిజెన్స్(భౌతిక మేధస్సు) ఆధారిత పరిష్కారాలపై తమకున్న వినూత్న ఆలోచనలను ఇరు సంస్థల ప్రతినిధులు  సీఎంకు, మంత్రులకు ఈ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌లో ఉన్న అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులకు తట్టుకునేలా సిగ్నలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.  

ఏఐతో ట్రాఫిక్ నియంత్రణపై ప్రజెంటేషన్..  

మహానగరంలో పెరుగుతున్న రవాణా సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు తాము రూపొందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్ట్ వివరాలను ప్రతినిధులు సీఎంకు వివరించారు. నగరంలో ఏఐ ప్లాట్‌‌ఫామ్స్ వినియోగం వల్ల చేకూరే ప్రయోజనాలను తెలియజేశారు. సెన్సర్లు, రోబోటిక్స్ వంటి అధునాతన టెక్నాలజీతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ విధానం ఎలా తోడ్పడుతుందనే అంశాలను పవర్‌‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో హైదరాబాద్‌‌ను కాగ్నిటివ్ సిటీ(మేధో నగరం)గా మార్చేందుకు ఉన్న విస్తృత అవకాశాలపై సమావేశంలో చర్చించారు. 

ముఖ్యంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని ముందస్తుగానే గుర్తించి సిగ్నళ్ల వ్యవస్థను మార్చడం, భూగర్భంలో నీటి లీకేజీలను కనిపెట్టి తక్షణ మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా మాత్రమే విద్యుత్ వాడటం వంటివాటిపై వివరించారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్‌‌లకు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఆటోమేటిక్‌‌గా రూట్ క్లియర్ అయ్యేలా చేసే సాంకేతికతనూ ప్రదర్శించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అనలాగ్‌‌తో మేఘా జాయింట్​వెంచర్.. త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ​

మౌలిక సదుపాయాలను ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల సాయంతో సమర్థంగా పని చేయించడానికి హైదరాబాద్‌‌ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కీలక అడుగు వేసింది. అబుదాబికి చెందిన గ్లోబల్ టెక్ సంస్థ అనలాగ్‌‌తో కలిసి50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌‌ను మేఘా ఏర్పాటు చేసింది. దీంతో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని విస్తృతంగా అమలు చేస్తామని కంపెనీ ఎండీ కృష్ణా రెడ్డి ప్రకటించారు. దీనికోసం రాబోయే మూడేళ్లలో ద్వారా రూ.4,756 కోట్ల వరకు పెట్టుబడి పెడతామన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత, పవర్ గ్రిడ్ సామర్థ్యం, విద్య, ఆరోగ్య రంగాల కంపెనీలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలను అందించడం ఈ కొత్త సంస్థ లక్ష్యమని చెప్పారు.  

హైదరాబాద్‌‌లోని సెక్రటేరియెట్‌‌కు సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక స్థాయి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. ఎంఈఐఎల్ సోలార్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ఈ రెండు సంస్థలు తెలిపాయి. దీనితోపాటు బ్యాటరీలు, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేసే అవకాశాలను మేఘా పరిశీలిస్తోందని, త్వరలోనే ఓ గ్లోబల్ కంపెనీతో భాగస్వామ్యాన్ని ప్రకటిస్తామని కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ దగ్గర రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, గత ఏడాది రూ.55 వేల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.