హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మక్కా మసీదు వద్ద శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయని, సిటీ బస్సులు అఫ్జల్‌గంజ్ వద్దే నిలివేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లా బస్సులు చాదర్‌ఘాట్, సైదాబాద్, మిథాని మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.
చార్మినార్ జోన్ మళ్లింపు పాయింట్లు
మదీనా జంక్షన్: నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.
హిమ్మత్‌పురా: నాగులచింత/శాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి వోల్గా హోటల్ (ఖిల్వత్ వైపు) మళ్లిస్తారు.
చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుంచి వచ్చే వాహనాలను కోట్లా అలీజా లేదా మొఘల్‌పురా వైపు పంపిస్తారు.
మోతీగల్లి: మూసాబౌలి నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లి వద్ద ఖిల్వత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్ శాలిబండ ఫతే దర్వాజా రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఏతబార్ చౌక్: గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను ఏతబార్ చౌక్ వద్ద మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు తరలిస్తారు.
షేర్ ఏ బాటిల్ కమాన్: మిట్టి కా షేర్ నుంచి గుల్జార్ హౌస్ వైపు వాహనాలను అనుమతించరు. ఇవి ఘాన్సీ బజార్ మీదుగా హైకోర్టు రోడ్డు/ఖిల్వత్ వైపు నుంచి వెళ్లాలి
లక్కడ్ కోట (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అవసరాన్ని బట్టి ఏపీఏటీ నుంచి వచ్చే వెహికల్స్ ను మండి మీరాలం మార్కెట్ వైపు మళ్లిస్తారు.
సికింద్రాబాద్ జోన్లో ఇలా..
సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ మహంకాళి ఎల్ అండ్ ఓ , పీఎస్ నుంచి ఓల్డ్ రామగోపాల్‌పేట పీఎస్ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మూసివేస్తారు.
బాటా ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద లాలా టెంపుల్ వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ని సంప్రదించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
పార్కింగ్ స్థలాలు
- మదీనా, పత్తర్‌గట్టి నుంచి వచ్చే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ఏర్పాటు చేశారు.
- యాకుత్‌పురా, నూర్ ఖాన్ బజార్, తలాబ్ కట్టా దబీర్‌పురా నుంచి వచ్చే వారు ముఫీద్ ఉల్ అనామ్ గ్రౌండ్లో పార్క్చేసుకోవాలి.
- చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా నుంచి వచ్చే వారి కోసం పార్కింగ్‌ను చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేశారు.
- సంతోష్ నగర్, తలాబ్ కట్టా మొఘల్‌పురా నుంచి వచ్చే వారు ఏయూ హాస్పిటల్ పార్కింగ్‌ను ఉపయోగించుకోవాలి.
- మిస్రిగంజ్, ఫతే దర్వాజా, హుస్సేనీ ఆలం పురానాపూల్ నుంచి వచ్చే వారు ఖిల్వత్ గ్రౌండ్ లో పార్క్చేసుకోవాలి.
- కిషన్‌బాగ్, బహదూర్‌పురా హుస్సేనీ ఆలం నుంచి వచ్చే వారు పాత పెన్షన్ ఆఫీస్ / ఉర్దూ మస్కన్ లో వాహనాలను నిలపాలి
