- డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా 6 నెలల జైలు
- ఫ్లైఓవర్లు మూసివేత.. భారీ వాహనాలపై రాత్రి బ్యాన్
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ ఏర్పాట్లు, ఆంక్షలు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. 31 రాత్రి నుంచి నగరవ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
సిటీలోని 217 కీలకమైన, రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద తగిన సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించనున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్)తో పాటు షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్ల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఇలా..
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని, న్యూఇయర్ వేడుకలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 31న రాత్రి 11 గంటల నుంచి జనవరి1 ఉదయం 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్లలో అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ అనుమతి ఉండదన్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ వివిధ జంక్షన్ల వద్ద అవసరాల ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని, ఖైరతాబాద్, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, నల్లగుట్ట, కవాడిగూడ, సెయిలింగ్ క్లబ్, కర్బాలా తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తామని వివరించారు.
విమాన టికెట్లు ఉంటేనే.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే ఎక్కాలి
అదనంగా బేగంపేట, టోలిచౌకి మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున వరకు మూసివేస్తామని తెలిపారు. విమాన టికెట్లు ఉన్న ప్రయాణికుల కోసం మాత్రమే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ పనిచేస్తుందని చెప్పారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ సరుకు వాహనాలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 2 గంటల వరకు నగర పరిధిలోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సహా ఈ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ మార్గాన్ని ఉపయోగించాలని సూచించారు.
ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు
ట్యాంక్ బండ్‌కు కాలినడకన వెళ్లే సందర్శకులు సెక్రటేరియట్ విజిటర్ పార్కింగ్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్ గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రేస్ కోర్స్ రోడ్ (ఎన్‌టీఆర్ ఘాట్ పక్కన), ఆదర్శ్ నగర్ లేన్ (బైక్స్), ఎన్‌టీఆర్ స్టేడియం వంటి ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.
స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, బార్లు, పబ్‌ల యాజమాన్యాలు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ సజావుగా ఉండేలా భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. మద్యం సేవించిన వినియోగదారులకు సురక్షిత రవాణా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా వారికి స్పష్టం చేశారు.
పదే పదే ఉల్లంఘనలు చేస్తే.. లైసెన్స్ రద్దు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. పదే పదే ఉల్లంఘనలు చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆర్టీఏ సస్పెండ్ చేస్తుందని తెలిపారు.
ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు @Hyderabad Traffic Police (ఫేస్బుక్), @HYDTP (ఎక్స్)ను అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు కాల్ చేయాలని సూచించారు. రహదారి భద్రత కోసమే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నామని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు సిబ్బందికి సహకరించాలని డీసీపీ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
