హైదరాబాద్ యునానీ  రీసెర్చ్ సెంటర్​కు  రూ. 16.05 కోట్లు

హైదరాబాద్ యునానీ  రీసెర్చ్ సెంటర్​కు  రూ. 16.05 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లోని నేషనల్ యునానీ మెడికల్ రీసెర్చ్ సెంటర్​కు కేంద్రం రూ.16.05 కోట్లు కేటాయించింది.  ఈ నిధితో స్కిన్ డిసీజ్​లకు సంబంధించిన ప్రైమరీ రీ సెర్చ్ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆయూష్​ శాఖ వెల్లడించింది. యునానీ మెడిసిన్ ఫెసిలిటీస్​ను ప్రోత్సహించేందుకు కేంద్ర మైనార్టీ శాఖతో కలిసి ముందుకెళ్తున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా మైనార్టీ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే)కింద రూ. 45.34 కోట్లను గ్రాంట్ల రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిధుల్ని హైదరాబాద్, చెన్నై, లక్నో, సిల్చార్, బెంగళూర్​లో యునానీ మెడికల్ సిస్టం ప్రమోట్, డెవలప్మెంట్, ఫెసిలిటీస్ అప్ గ్రేడ్ కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ మొత్తం నిధుల్లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్​ ఇన్ యునానీ మెడిసిన్(సీసీఆర్ యూఎం)కు రూ.35.52 కోట్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ యునానీ మెడిసిన్ (ఎన్ ఐయూఎం)  బెంగళూరుకు రూ.9.81 కోట్లు మంజూరు చేసినట్లు ఆయూష్ శాఖ తెలిపింది.