ఔటర్ చుట్టూ రింగ్ పైప్ లైన్.. నీటి సరఫరాలో సమస్యలకు చెక్

 ఔటర్ చుట్టూ రింగ్ పైప్ లైన్.. నీటి సరఫరాలో సమస్యలకు చెక్

 

  • 158 కి.మీ. పరిధిలో  నిర్మాణానికి వాటర్​ బోర్డు ప్లాన్​ 
  • అన్ని రిజర్వాయర్ల పైపులైన్లు లింక్​ 
  • ఏ లీకేజీ, రిపేర్​ ఉన్నా సరఫరా బంద్​ కాకుండా ప్రణాళిక
  • ఖర్చు రూ.7,200 కోట్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరాలో అంతరాయాలను నివారించడానికి వాటర్ బోర్డు కొత్త ప్లాన్​వేసింది. ప్రస్తుతం బోర్డు పరిధి ఓఆర్ఆర్​వరకూ విస్తరించిన నేపథ్యంలో సరఫరాను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఔటర్ రింగురోడ్డు చుట్టూ158 కి.మీ. పరిధిలో ఔటర్ రింగ్ మెయిన్ పైప్ లైన్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గ్రేటర్​కు కృష్ణా ప్రాజెక్టు మూడు దశలు, గోదావరి, మంజీరా, సింగూరు, ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​నుంచి నీటిని తరలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ జలాశయాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వేరు వేరు పైప్​లైన్​వ్యవస్థ ఉంది. దీంతో ఎప్పుడైనా ఒక జలాశయ పరిధిలోని పైప్​లైన్​కు లీకేజీ ఏర్పడినా, రిపేర్లు వచ్చినా రిపేర్​చేసే టైంలో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం నగరంలో ఇలాంటి పరిస్థితి తరచూ ఏర్పడుతోంది. దీని వల్ల చాలా సమయం వృథా కావడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా ఉండక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని తొలగించడానికి వాటర్​బోర్డు ఔటర్ రింగ్ మెయిన్ పైప్ లైన్ ఆలోచన చేసింది.  

అన్ని జలాశయాల పైపులైన్ల అనుసంధానం

నగరానికి నీటిని అందించే అన్ని ప్రధాన జలాశయాల పైప్​లైన్​లన్నింటినీ అనుసంధానం చేసేలా ఔటర్​రింగ్​మెయిన్​వ్యవస్థను నిర్మించనున్నట్టు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్ల నీళ్లు ఒకే పైప్​లైన్​లోకి వచ్చేలా క్లోజ్డ్​లూప్​ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఔటర్ చుట్టూ 158 కి.మీ. పరిధిలో 3000 ఎంఎం డయామీటర్​పైప్​లైన్​నిర్మిస్తారు. ఇందులోకి కృష్ణా,  గోదావరి, మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైప్ లైన్​లింక్​చేస్తారు. ఈ ఐదు జలాశయాల నీరు ఈ పైప్ లైన్ లోకి పంప్ చేస్తారు. దీని వల్ల ఒక ప్రాంతంలో పైప్​లైన్​లీకేజీలకు గురైనా, రిపేర్లకు వచ్చినా మరో ప్రాంతంలో నీటి సరఫరా నిలిపివేసే అవసరం ఉండదు.

ఎందుకంటే నగరం చుట్టూ ఒకే పైప్​లైన్​కు అన్ని ప్రాంతాలు లింక్​అయి ఉండడం వల్ల నీటి సరఫరా యథావిధంగా చేసే అవకాశం ఉంటుంది. మూడేండ్ల కిందటే ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించేందుకు ప్లాన్​చేశారు. పటాన్​చెరు ఔటర్​ వద్ద 18 కి.మీ. మేరకు పైప్​లైన్​కూడా నిర్మించారు. అయితే, భారీగా నిధులు అవసరం కావడంతో నిలిపి వేశారు. 

రూ.7,200 కోట్లతో ప్రాజెక్టు 

తాజాగా నగరంలో తరచూ నీటి సరఫరాలో అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరోసారి ఔటర్​రింగ్​ మెయిన్​పై అధికారులు దృష్టి పెట్టారు. పటాన్​చెరు వద్ద 18 కి.మీ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన140 కి.మీ. పరిధిలో పైప్​లైన్​ నిర్మాణానికి డీపీఆర్​పూర్తి చేసిన అధికారులు అడ్మినిస్ట్రేషన్​ శాంక్షన్​ కోసం ప్రభుత్వానికి పంపారు. అక్కడి నుంచి గ్రీన్​ సిగ్నల్​ రాగానే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు మెట్రోవాటర్​బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా మరో 24  కొత్త భారీ రిజర్వాయర్లను కూడా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.