
- ఇప్పటికే బిల్లుల వసూళ్లు, పంపిణీ, ట్యాంకర్ల బుకింగ్‌లో వాడకం
- త్వరలోనే సరఫరా, ప్రాజెక్టు పనులు, అధికారుల పనితీరు అంచనా వేసేందుకు ఏఐ
హైదరాబాద్‌సిటీ, వెలుగు :వాటర్‌బోర్డులో ఏఐ టెక్నాలజీ సేవలు వినియోగించుకునేందుకు అధికారులు ప్లాన్చేస్తున్నారు. ఇప్పటికే బిల్లుల వసూళ్లు, బిల్లుల పంపిణీ తీరు, ట్యాంకర్లు ఏ ప్రాంతం నుంచి ఎవరు ఎక్కువ బుక్చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఏఐ వాడుతున్నారు. త్వరలో నీటి సరఫరా వివరాలు కచ్చితంగా తెలుసుకోవడం కోసం, ప్రాజెక్టు పనులు, అధికారుల పనితీరును అంచనా వేసేందుకు, వినియోగ దారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు, ఏ మేరకు పరిష్కారమయ్యాయో తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నట్టు బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
ఏఐతో ఏం తెలుసుకుంటున్నారంటే..
గత ఏడాది మెట్రో కస్టమర్ కేర్(ఎంసీసీ)లో నమోదైన ఫిర్యాదులను, ట్యాంకర్ బుకింగ్ వివరాలను ఏఐ ద్వారా కొద్ది రోజులుగా ఐటీ వింగ్విశ్లేషిస్తోంది. ఇందులో భాగంగా ఏయే సమస్యలపై..ఏఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? తరుచూ నమోదవుతున్న ఫిర్యాదుల వివరాలంటి? ఏయే డివిజన్ల నుంచి అత్యధికంగా ట్యాంకర్లు బుక్‌చేస్తున్నారు? ఎక్కువ సార్లు బుక్చేసుకున్నవారెవరు? అని అడిగితే క్షణాల్లో పూర్తి డేటా ఇచ్చింది.
గత సెప్టెంబరు1 నుంచి ఇప్పటివరకు వివిధ సమస్యలపై 6 లక్షల 50 వేలకు పైగా ఫిర్యాదులు బోర్డు కస్టమర్ కేర్ కు వచ్చాయని,12 లక్షలపైగా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని వివరాలిచ్చింది. అలాగే గత వేసవిలో అత్యధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన టాప్10 వినియోగదారులను ఏఐ సాయంతో గుర్తించారు. ఇందులో ప్రగతినగర్ లోని సౌతన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ గత ఏడాది 674 ట్యాంకర్లను బుక్‌చేసుకుని టాప్‌ప్లేస్‌లో నిలిచిందని చెప్పింది. వెంటనే ఎండీ అశోక్‌రెడ్డి సదరు అపార్ట్‌మెంట్‌ను విజిట్‌చేసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వీరికి బోరు లేక పోవడం కూడా ఒక కారణంగా గుర్తించారు.
5వేలు పై చిలుకు బిల్లుల చెల్లింపు దారుల గుర్తింపు
ఏఐ ద్వారా 5వేలకు పైబడి బిల్లుల చెల్లింపుదారుల వివరాలను కూడా గుర్తించారు. వారు ఖచ్చితంగా బిల్లులు చెల్లిస్తున్నారా? లేదా? అనేది తెలుసుకుంటున్నారు. బోర్డుకు నెలకు రూ.120 నుంచి రూ.130 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఏఐ సాయంతో రూ.90 నుంచి రూ.100 కోట్లకు చేర్చామని అధికారులు అంటున్నారు. నెలనెలా బిల్లులు చెల్లించని వారి వివరాలను తెలుసుకుని సక్రమంగా కట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే టెక్నాలజీతో సిటీలో ఇంకుడు గుంతలున్న వినియోగదారులు, లేని వారిని కూడా గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తుండడంతో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రచారం చేస్తున్నారు. అధికారులు ఏ ప్రాంతంలో ఉన్నారు తెలుసుకునేందుకు...ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను నేరుగా బోర్డు ఆఫీసు నుంచే తెలుసుకునేందుకు కూడా ఏఐ వాడుతున్నారు. రాబోయే కాలంలో బోర్డు అన్ని కార్యకలాపాలు సత్వరంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు ఏఐ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకుంటామని బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.