హైదరాబాద్: రుతుపవన ద్రోణి తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతోంది. ఈరోజు (మంగళవారం, ఆగస్ట్ 5) ఉదయం రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 1.5 నుంచి 7.6 కి.మీ మధ్యలో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మంగళవారం సాయంత్రం కూడా హైదరాబాద్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసింది. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ నగరంలో వాన పడే ఛాన్స్ ఉందని ఉంది.
దీంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ALSO READ : ఊరు మొత్తాన్ని ఊడ్చేసిన బురద నీరు.. ఉత్తరకాశిలో కొండ కింద ప్రళయం..
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఈరోజు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం వుంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుంచి -40 కి.మీ) కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో రేపు (ఆగస్ట్ 5, 2025) భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు వరద అంతకంతకూ పెరుగుతుంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాళాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటం గమనార్హం. హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటి మట్టం చేరుకుంది.
హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం 513.45 మీటర్లు. హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ను అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్కి 1208 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 1027 క్యూసెక్కుల ఔట్ ఫ్లోను అధికారులు విడుదల చేస్తున్నారు. అశోక్ నగర్, దోమలగూడ, అంబర్ పేట్, గోల్నాక ద్వారా మూసీలో వరద కలుస్తుండటం గమనార్హం.
