- హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా ‘తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్’ అనే టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ‘సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం’ అనే అంశంతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్‌లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కార్యక్రమం మూడు రోజుల పాటుకొనసాగనుంది.
ఈ వేదికపై కవి సమ్మేళనం, విభిన్న భాషల సాహిత్య సమ్మేళనం, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ప్రకృతి పండుగల విశిష్టత, సాంస్కృతిక సమన్వయం, వివిధ కళా ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.రెండో విడతను ఈ నెల 25 –27 వరకు నిర్వహించనున్నారు. ఆరోగ్యం, ఫార్మా & లైఫ్ సైన్సెస్, ఐటీ, ఇన్నోవేషన్ అంశాలను ప్రముఖులు వివరించనున్నారు.
తెలంగాణ సాంస్కృతిక, సాంక్షేమ శాఖతో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ప్రభుత్వాలు, సంస్థలు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాయి. రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
