V6 News

ఉప్పల్‎లో అభి ‘వంద’నం.. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్‎లో అభి ‘వంద’నం.. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం

భాగ్యనగర గడ్డపై  సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (68 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 నాటౌట్‌‌) మళ్లీ అదరగొట్టాడు. మొన్న  మెరుపు ఫిఫ్టీతో మెప్పించిన అభి.. ఈసారి టాప్ క్లాస్‌‌ ఆటతో ఢిల్లీ బౌలింగ్‌‌ను షేక్‌‌ చేశాడు. క్లాసిక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేస్తూ  ఐపీఎల్‌‌లో  తన రెండో సెంచరీ కొట్టాడు.  అతని జోరుతో భారీ స్కోరు  చేసిన సన్‌‌రైజర్స్.. బౌలింగ్‌‌లో ఈషాన్ మలింగ (4/32) దుమ్మురేపడంతో  ఐపీఎల్‌‌లో వందో మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి  సొంతగడ్డపై మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. 

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్ డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (68 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 నాటౌట్‌‌) మళ్లీ అదరగొట్టాడు. మొన్న మెరుపు ఫిఫ్టీతో మెప్పించిన అభి.. ఈసారి టాప్ క్లాస్‌‌ ఆటతో ఢిల్లీ బౌలింగ్‌‌ను షేక్‌‌ చేశాడు. దీంతో మంగళవారం హైదరాబాద్​ వేదికగా జరిగిన పోరులో సన్​రైజర్స్​ టీమ్ 47 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తుగా ఓడించింది. ఫస్ట్​ బ్యాటింగ్‌‌ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 242/2 స్కోరు చేయగా.. డీసీ 20 ఓవర్లలో195/9   స్కోరు చేసి ఓడిపోయింది.

హైదరాబాద్‌‌, వెలుగు: ఖతర్నాక్ బ్యాటింగ్‌‌, పర్‌‌‌‌ఫెక్ట్ బౌలింగ్‌‌తో మెప్పించిన  సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌‌ ఐపీఎల్‌‌–19లో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో  47 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తుగా ఓడించింది.  ఉప్పల్‌‌లో వరుసగా మూడో విజయం, ఓవరాల్‌‌గా నాలుగో విజయం అందుకొని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన హైదరాబాద్ 20 ఓవర్లలో 242/2 స్కోరు చేసింది. 

అభికితోడు హెన్రిచ్ క్లాసెన్ (13 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్‌‌) మెరిపించాడు. అనంతరం ఛేజింగ్‌‌లో డీసీ  20 ఓవర్లలో195/9   స్కోరు చేసి ఓడిపోయింది.  నితీశ్ రాణా (30 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3సిక్సర్లతో 57), సమీర్ రిజ్వీ (28 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) పోరాడారు. హర్ష్‌‌ దూబే (3/12) మూడు వికెట్లు తీశాడు. అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.

టాప్ క్లాస్ అభి‘షేక్’ 

అభిషేక్ సెంచరీతో విజృంభించడంతో  సన్‌‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. గత మ్యాచ్‌‌ ఫామ్‌‌ను కొనసాగించిన అభి.. ఏ ఒక్క బౌలర్‌‌‌‌నూ వదలకుండా  ఖతర్నాక్‌‌ షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని మరోసారి హోరెత్తించాడు.  ముకేశ్ వేసిన ఫస్ట్ ఓవర్లో బౌండరీల ఖాతా తెరిచిన అభి.. అతని బౌలింగ్‌‌లోనే రెండు ఫోర్లతో వేగం పెంచాడు. మరో ఎండ్‌‌లో   ట్రావిస్ హెడ్ (37) తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  రాణా వేసిన ఐదో ఓవర్లో అభి వరుసగా రెండు సిక్సర్లతో మరింత జోరు పెంచగా.. హెడ్ ఓ సిక్స్ బాదడంతో 20 రన్స్ వచ్చాయి. 

ఎంగిడి బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో పవర్‌‌‌‌ ప్లేను అభి 67/0తో ముగించాడు. ఫీల్డింగ్ మారిన తర్వాత అక్షర్‌‌‌‌, కుల్దీప్‌‌ వరుసగా 7, 8 రన్స్ మాత్రమే ఇచ్చారు. కానీ, అక్షర్ వేసిన తొమ్మిదో ఓవర్లో డబుల్‌‌తో ఫిఫ్టీ (25 బాల్స్‌‌లో) పూర్తి చేసుకున్న అభి, హెడ్ చెరో సిక్స్ రాబట్టారు. మరో షాట్‌‌కు ట్రై చేసిన హెడ్‌‌  డీప్ మిడ్‌‌ వికెట్‌‌లో రిజ్వీకి క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌‌కు 97 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన ఇషాన్‌‌ కిషన్ (25) ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు.

 కుల్దీప్ వేసిన 11వ ఓవర్లో  ఇషాన్ రెండు ఫోర్లు, సిక్స్.. అభి ఓ సిక్స్ కొట్టడంతో 22 రన్స్ లభించాయి. ఈ ఇద్దరి ధాటికి  13 ఓవర్లకే స్కోరు 150 దాటింది.  నటరాజన్ బౌలింగ్‌‌లో  ఇచ్చిన క్యాచ్‌‌ను బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌లో రాణా డ్రాప్ చేయడంతో 86 రన్స్ వద్ద అభికి లైఫ్ లభించింది. దీన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు.  రాణా వేసిన తర్వాతి ఓవర్లో  మూడు సిక్సర్లు, ఫోర్‌‌‌‌తో  23 రన్స్ పిండుకొని సెంచరీ (47  బాల్స్‌‌లో)  పూర్తి చేసుకున్నాడు.

 మధ్యలో ఇషాన్ రనౌటవడంతో  క్రీజులోకి వచ్చిన క్లాసెన్ కూడా ధాటిగా ఆడాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లో  తను వరుసగా రెండు సిక్సర్లతో అలరించాడు. ఇద్దరి జోరు చూస్తుంటే రైజర్స్‌‌ స్కోరు 250 దాటేలా కనిపించింది. కానీ, 19వ ఓవర్లో కట్టుదిట్టమైన బాల్స్‌‌ వేసిన  నటరాజన్‌‌ 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ముకేశ్ బౌలింగ్‌‌లో అభి ఓ ఫోర్ కొట్టగా.. క్లాసెన్ ఓ సిక్స్, రెండు సిక్సర్లతో  స్కోరు 240 దాటించాడు.  

ఈషాన్ మలింగ దెబ్బ

ఫ్లాట్ వికెట్‌‌పై భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఈషాన్ మలింగ సహా  సన్‌‌రైజర్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ టీమ్‌‌ను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఛేజ్  స్టార్టింగ్‌‌లోనే ఢిల్లీకి షాక్‌‌ తగిలింది. ఇన్నింగ్స్ ఐదో బాల్‌‌కే సిక్స్‌‌ కొట్టిన ఓపెనర్‌‌‌‌ పాథుమ్ నిశాంక (8)ను మూడో ఓవర్లో మధుషంక పెవిలియన్ చేర్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. కానీ, మరో ఓపెనర్   కేఎల్ రాహుల్  (37) ధాటిగా ఆడాడు. 

రెండో ఓవర్లో నితీశ్ రెడ్డికి రాహుల్ 6, 4తో స్వాగతం పలకగా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన నితీశ్ రాణా మరింత దూకుడు చూపెట్టాడు. నితీశ్ రెడ్డిని టార్గెట్ చేసి రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఐదో ఓవర్లో రాహుల్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌‌ను ఈషాన్ మలింగ డ్రాప్ చేశాడు. తర్వాతి బాల్‌‌కే సిక్స్ కొట్టిన కేఎల్ ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకున్నాడు. 8వ ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన లెఫ్టార్మ్​ స్పిన్నర్  బౌలింగ్‌‌లో రాణా 6,6,4తో వేగం పెంచగా.. ఆ వెంటనే రాహుల్ మరో సిక్స్‌‌ కొట్టాడు. 

కానీ, సాకిబ్ హుస్సేన్ వేసిన  పదో ఓవర్లో  మరో షాట్‌‌కు ట్రై చేసిన రాహుల్‌‌..  అభిషేక్‌‌కు చిక్కడంతో  రెండో వికెట్‌‌కు  86 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ బ్రేక్ అయింది. అయినా సగం ఓవర్లకు 107/2తో నిలిచిన డీసీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో  అభి క్యాచ్‌‌తో  రాణాను పెవిలియన్‌‌ చేర్చిన మలింగ.. తర్వాతి బాల్‌‌కే డేంజర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (0)ను  బౌల్డ్‌‌ చేయడంతో డీసీ 109/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (27) ఫోర్లు, సిక్సర్లతో ఎదరుదాడికి దిగి విజయంపై ఆశలు రేపారు.

 కానీ, 16వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు దిగిన ఈషాన్ మలింగ.. స్టబ్స్‌‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. తన తర్వాతి ఓవర్లోనే  ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (14) ను కూడా పెవిలియన్ చేర్చడంతో సన్‌‌రైజర్స్ విజయం  ఖాయమైంది. చివరి ఓవర్లో అక్షర్ (2), రిజ్వీ , ఎంగిడి (0)ని ఔట్‌‌ చేసిన దూబే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 

 సంక్షిప్త స్కోర్లు

సన్‌‌రైజర్స్‌‌: 20 ఓవర్లలో  242/2 (అభిషేక్ 135 నాటౌట్‌‌, క్లాసెన్ 37 నాటౌట్‌‌, అక్షర్ పటేల్ 1/23). ఢిల్లీ: 20 ఓవర్లలో 195/9  (నితీశ్ రాణా 57,  సమీర్ రిజ్వీ 41, ఈషాన్ మలింగ 4/32, హర్ష్ దూబే 3/12)

ఐపీఎల్‌‌లో  అభిషేక్ శర్మకు ఇది రెండో  సెంచరీ. 2025లో పంజాబ్ కింగ్స్‌‌పై (141 రన్స్‌‌) తొలి సెంచరీ కొట్టాడు.
టీ20 ఫార్మాట్‌‌లో అభిషేక్‌‌కు ఇది ఓవరాల్‌‌గా తొమ్మిదో సెంచరీ. ఈ ఫార్మాట్‌‌లో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఇండియన్‌‌ ‌‌గా విరాట్ కోహ్లీ రికార్డు సమం చేశాడు.
టీ20 ఇన్నింగ్స్‌‌లో  అభిషేక్  పది అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం ఇది ఐదోసారి. క్రిస్ గేల్‌‌ 18సార్లు ఈ ఘనత సాధించాడు.