ఫిల్మ్‌‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లా బిల్లు అప్డేట్ పేరుతో..రూ.2 లక్షల సైబర్ ఫ్రాడ్

ఫిల్మ్‌‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లా బిల్లు అప్డేట్ పేరుతో..రూ.2 లక్షల సైబర్ ఫ్రాడ్

జూబ్లీహిల్స్, వెలుగు: ఫిల్మ్‌‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నీటి బిల్లు అప్​డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు ఓ మహిళను నమ్మించి, ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి రూ.2.07 లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని హుడా హైట్స్ ప్రాంతానికి చెందిన లయీకున్నిస (44) అనే గృహిణికి వాట్సాప్​లో గుర్తుతెలియని వ్యక్తులు “HMWSSB WATER BILL UPDATE.apk” పేరుతో ఒక నకిలీ అప్లికేషన్​ను పంపారు. నీటి బిల్లు అప్​డేట్ చేయాల్సి ఉందని నమ్మించి, ఆ అప్లికేషన్​ను ఆమె మొబైల్​లో ఇన్‌‌స్టాల్ చేయించారు. 

అప్లికేషన్ ఇన్​స్టాల్ చేసిన అనంతరం.. ఆమెకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఖాతాలు, కార్డుల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. దీంతో బాధితురాలు మొత్తం రూ.2,07,134.22 నగదును కోల్పోయినట్లు గుర్తించింది. అనంతరం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్​లైన్ 1930కు కాల్ చేసి, అలాగే ఎన్​సీఆర్పీ పోర్టల్​లో  ఫిర్యాదు చేశారు.