కుక్కల కోసం పోలీసులపై ఓవరాక్షన్ : 20 రోజుల జైలు శిక్ష

కుక్కల కోసం పోలీసులపై ఓవరాక్షన్ : 20 రోజుల జైలు శిక్ష

రెండ్రోజుల క్రితం(బుధవారం) హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు విధులు నిర్వహిస్తున్న పోలీసులపై.. ఓ యువకుడు దూషణకు దిగిన విషయం తెలిసిందే. నారాయణగూడలో నివాసముండే ప్రణవ్ (29) అనే యువకుడు.. బుధవారం ఉదయం వాకింగ్ కోసమని తన పెంపుడు శునకాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డుపైకి తీసుకొచ్చాడు. 

అక్కడ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న నారాయణగూడ పోలీసుల పెట్రోలింగ్ కారు కదిలింది. అంతే సదరు యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ వారిని ఇష్టానుసారం దూషించాడు. స్థానికులు, పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినా.. అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆవేశంగా ఊగిపోతూ వారిపై బూతుపురాణం మొదలుపెట్టాడు. గత్యంతరం లేని పరిస్థితిలో సదరు పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

20 రోజుల జైలు శిక్ష

ఈ కేసులో పోలీసు పెట్రోకార్ సిబ్బందితో గొడవపడినందుకు సదరు యువకుడికి న్యాయస్థానం 20 రోజుల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు నారా యణగూడ ఎస్సై షఫీ మీడియాకు తెలిపారు. ఆ యువకుడు అమెరికాలో ఉంటాడని సమాచారం. ఇటీవలే నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.