ఏది బెస్ట్ : హైదరాబాద్ బిర్యానీ Vs కరాచీ బిర్యానీ : వసీం అక్రమ్ తెచ్చిన చిచ్చు

ఏది బెస్ట్ : హైదరాబాద్ బిర్యానీ Vs కరాచీ బిర్యానీ : వసీం అక్రమ్ తెచ్చిన చిచ్చు

హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ కాదంట.. అది పులావ్ అంట.. బిర్యానీ అంటే కరాచీ బిర్యానీ అంట.. ఎంత మాట ఇది.. ఎంత మాట.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. వీడియో సాక్ష్యంగా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతోంది. 

పాకిస్తాన్ క్రికెట్ జట్టు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పర్యటిస్తుంది. పది రోజులుగా ఇక్కడే బస చేస్తుంది. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ జట్టు జువెల్ ఆఫ్ నిజాంలో హైదరాబాద్ బిర్యానీ తిన్నది. దీనికి రేటింగ్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ వారం రోజులుగా చర్చనీయాంశం అయ్యింది. 

ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ లకు కామెంటరీ ఇస్తున్న వసీం అక్రమ్.. హైదరాబాద్ బిర్యానీపై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీ.. బిర్యానీనే కాదు.. అది పులావ్.. మెత్తగా ఉంటుంది.. అదే కరాచీ బిర్యానీ పొడిగా.. ముత్యాల్లా ఉంటుంది.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన బిర్యానీ అంటే కరాచీ బిర్యానీ అంటూ వ్యాఖ్యానించారు వసీం అక్రమ్.

హైదరాబాద్ బిర్యానీపై పాక్ క్రికెటర్లు..

పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ హైదరాబాద్ బిర్యానీని అసలు బిర్యానీయే కాదంటే..తాజా కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం..హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అద్భుతంగా అంటూ కితాబిచ్చాడు. బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్ వంటి పాకిస్తాన్ క్రికెటర్లు హైదరాబాద్ బిర్యానీ రుచి ఆమోఘమని కొనియాడారు. హైదరాబాద్ బిర్యానీ కరాచీ బిర్యానీ కంటే రుచిగా ఉందని చెప్పారు. 

హైదరాబాద్ బిర్యానీకి పాక్ క్రికెటర్ల రేటింగ్..

హైదరాబాద్ బిర్యానీ, కరాచీ బిర్యానీ కూడా రెండు వేరు వేరు రుచిని కలిగిఉంటాయన్నారు బాబర్ అజామ్,  ఇమామ్-ఉల్-హక్. రెండింటికి సమానమైన రేటింగ్ ఇచ్చారు. కరాచీ బిర్యానీ కంటే హైదరాబాదీ బిర్యానీ కాస్త స్పైసీగా ఉంటుందని బాబర్ తెలిపారు. అయితే  పేసర్ హసన్ అలీ, ఇతర పాక్ క్రికెటర్లు మాత్రం కరాచీ బిర్యానీ కంటే హైదరాబాదీ బిర్యానీకే ఎక్కువ రేటింగ్ ఇవ్వడం విశేషం.  

మొత్తానికి హైదరాబాద్ బిర్యానీ బాగాలేదంటూ  మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ వ్యాఖ్యలు చేస్తే..వసీం అక్రమ్ చెప్పేది అంతా అబద్దమని..హైదరాబాద్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉందంటూ తాజా కెప్టెన్ బాబర్ ఆజమ్..ఇతర పాక్ క్రికటర్లు మెచ్చుకున్నారు.