ఉదయం సాఫ్ట్‌వేర్ జాబ్.. నైట్ అంబులెన్స్ డ్రైవర్

ఉదయం సాఫ్ట్‌వేర్ జాబ్.. నైట్ అంబులెన్స్ డ్రైవర్

అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఏసీ రూంలో కూర్చొని పనిచేస్తూ.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. కానీ అవేవీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. వెంటనే అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయాడు. ప్రతిరోజూ కరోనా పేషంట్లను ఆస్పత్రులకు చేరుస్తూ సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. 

హైదరాబాద్‌కు చెందిన తరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువులు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. దాదాపు 8 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గతేడాది కరోనా విజృంభణ సమయంలో అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. తల్లిని చూసుకుంటూ.. ఇంట్లోంచే వర్క్ చేస్తున్నాడు. తల్లి ఆరోగ్యం కుదుటపడుతుండటంతో మళ్లీ అమెరికా వెళ్ళాలనుకుంటున్న సమయంలోనే భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దాంతో మళ్లీ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

అయితే కరోనాతో నగరంలో ఎంతోమంది పడుతున్న ఇబ్బందులను టీవీలలో, సోషల్ మీడియాలలో చూసిన తరుణ్‌కు మనసు ఆగలేదు. ఆస్పత్రులకు వెళ్లడానికి అంబులెన్స్‌లు లేక, ఆక్సిజన్ దొరకక, ఆస్పత్రులలో బెడ్లు దొరకక కరోనా రోగులు పడుతున్న అవస్థలు అతన్ని నెమ్మదిగా ఉండనివ్వలేదు. పైగా.. ప్రతిరోజూ ఓ మెషిన్‌లా గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తుంటే తరుణ్‌‌కు ఏమాత్రం నచ్చలేదు. కరోనా పేషంట్ల కోసం ఏదైనా చేయాలని నిర్ణయానికి వచ్చాడు.

అనుకున్నదే తడవుగా.. అమెరికాలోని తన స్నేహితులకు విషయం చెప్పాడు. వారితో కలిసి ఫండ్ రైజ్ చేశాడు. అదేవిధంగా ఎథ్నే అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒక ఓమ్ని వ్యానును సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ఫండ్ రైజ్ ద్వారా వచ్చిన డబ్బులతో వ్యానును అంబులెన్స్‌గా మార్చాడు. అందులో ఆక్సిజన్ సిలిండర్, ప్రథమచికిత్సకు కావలసని అన్ని సదుపాయాలను పొందుపరిచాడు. అప్పటినుంచి సాయంకోరిన ప్రతి ఒక్కరికీ చేయందిస్తున్నాడు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కడినుంచైనా సరే ఫోన్ వస్తే వెంటనే అక్కడికి వాలిపోతున్నాడు. పేషంట్లను ఆస్పత్రులకు, ఐసోలేషన్ సెంటర్లకు చేరవేస్తున్నాడు. పైగా.. మందుల ఖర్చుల కోసం తన దగ్గరున్న డబ్బులను కూడా ఇస్తున్నాడు. తాజాగా తరుణ్ సేవలను మెచ్చుకుంటూ ప్రముఖ సబ్బుల కంపెనీ ‘డెటాల్’ తమ హ్యాండ్ వాష్ ప్రొడక్ట్‌లపై ఆయన ఫోటోను కూడా ముద్రించింది. 


ఈ చేయూత గురించి తరుణ్‌ని అడిగితే.. ఎదుటివారికి సాయం చేస్తే తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని, తన కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడనే ఆశతోనే చేస్తున్నాని అంటున్నాడు. ‘ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అంబులెన్స్ సేవలందించి.. ఆ తర్వాత సిస్టం ముందు కూర్చుంటాను. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సేవ చేస్తాను. నేను బయట తిరిగేది చూసి మా ఇంట్లో వాళ్లు కూడా భయపడుతున్నారు. కాకపోతే.. నేను వ్యాక్సిన్ తీసుకొని.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని వాళ్లకు చెప్పాను. కరోనా మొదటి వేవ్‌ను చూసిన తర్వాతైనా రెండో వేవ్‌ను ఎదుర్కొవడానికి మనదేశం ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే కలిసికట్టుగా దేన్నైనా ఎదుర్కొవచ్చు’ అని తరుణ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.