- హెచ్‌సీఏ టోర్నమెంట్లలో దుమ్మురేపుతున్న రాకేశ్, నికిల్
హైదరాబాద్, వెలుగు: టీమిండియాకు ఎంతోమంది మేటి క్రికెటర్లను అందించిన హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు యువ కెరటాలు దూసుకొస్తున్నారు. సిటీకి చెందిన అన్నాదమ్ములు గరిమెళ్ల రాకేశ్ శేఖర్, నికిల్ శేఖర్ హెచ్‌సీఏ అండర్–-14 లెవెల్‌లో అదరగొడుతున్నారు. మూడేండ్ల ప్రాయంలోనే బ్యాట్ పట్టిన ఈ ఇద్దరు బ్రదర్స్ రోజు రోజుకూ రాటుదేలుతూ సిటీ ఫ్యూచర్ స్టార్స్‌గా కనిపిస్తున్నారు. బాయ్స్‌టౌన్ స్కూల్, క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ స్కూల్ క్రికెట్‌తో పాటు హెచ్‌సీఏ- సి–డివిజన్ లీగ్స్‌లో సత్తా చాటుతున్నారు. 8వ క్లాస్ స్టూడెంట్ రాకేశ్ టాపార్డర్ బ్యాటర్‌గా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. 2025 సీజన్ హెచ్‌సీఏ అండర్–14 స్కూల్స్ వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో బాయ్స్ టౌన్‌కు కెప్టెన్‌గా ఉన్న రాకేశ్ 4 మ్యాచ్‌ల్లోనే ఓ డబుల్ సెంచరీ, సెంచరీ, ఫిఫ్టీ సహా 474 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కూల్స్ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ కొట్టిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అండర్–14 బాయ్స్ 2డే ప్రాబబుల్స్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 2 ఫిఫ్టీలతో 341 రన్స్ చేసి అక్కడా టాప్ లేపాడు. పేరున్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు సైతం బరిలో నిలిచే సి–డిజిజన్ వన్డే లీగ్ 7 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, ఫిఫ్టీ సహా 363 రన్స్‌తో మెప్పించాడు. కోహ్లీని ఆరాధించే రాకేశ్ అతనిలానే దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆల్‌రౌండర్ నికిల్
అన్న రాకేశ్ పరుగుల వరద పారిస్తుంటే ఏడో క్లాస్ చదువుతున్న తమ్ముడు నికిల్ ఆల్‌రౌండర్‌గా మెరుస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్‌గా బంతితో నిప్పులు చెరుగుతూనే, బ్యాట్‌తోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. సి–-డివిజన్ లీగ్‌లో 7 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత కూడా ఉంది. అండర్-14 స్కూల్స్ లీగ్‌లో 11 వికెట్లు తీయడమే కాకుండా 173 రన్స్ చేసి జట్లు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఇద్దరు యంగ్‌స్టర్స్ వెనుక వాళ్ల తండ్రి మురళీ కృష్ణ కృషి ఎంతో ఉంది. ఒకప్పుడు అండర్-19 వరకు క్రికెట్ ఆడి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటకు దూరమైన మురళీ కృష్ణ తన ఆశయాలను కుమారుల ద్వారా నెరవేర్చుకోవాలని తపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, తన సంపాదననంతా పిల్లల శిక్షణ కోసమే వెచ్చిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదిగే సత్తా ఉన్న రాకేశ్, నికిల్ ఆటను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ అన్నాదమ్ములకు సరైన ప్రోత్సాహం లభిస్తే హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు మంచి క్రికెటర్లను చూడొచ్చు.
