100 చెరువులు అభివృద్ధి జరిగితే వరదలను నియంత్రించొచ్చు : హైడ్రా చీఫ్ రంగనాథ్

100 చెరువులు అభివృద్ధి జరిగితే వరదలను నియంత్రించొచ్చు : హైడ్రా చీఫ్ రంగనాథ్
  • ఇప్పటికే ఆరు చెరువులు డెవలప్​ చేశాం 
  • 3 చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం 

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైడ్రా మొదటి విడత ఆరు చెరువులు అభివృద్ధి చేయగా ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని, మరో మూడు చెరువులను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని హైడ్రా చీఫ్​ రంగనాథ్​ చెప్పారు. కూకట్ పల్లి నల్ల చెరువు దగ్గర నిర్వహించిన కైట్​ఫెస్టివల్​లో ఆయన పాల్గొని పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే డెవలప్​చేసిన చెరువులకు తోడు మరో 14 చెరువులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామన్నారు. నగరంలో 100 చెరువులు అభివృద్ధి జరిగితే చాలావరకు వరదలను నియంత్రించవచ్చన్నారు.

 2024లో నిరసనలు...ఇప్పుడు అభినందనలు

2024 సెప్టెంబరులో నల్ల చెరువు విస్తరణ చేపట్టినప్పుడు నిరసనలు ఎదురయ్యాయని, కానీ ఇప్పుడు పండగ వాతావరణం నెలకొందని, అంతా అభినందిస్తున్నారని రంగనాథ్​అన్నారు. కబ్జాలతో16 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు.  10 అడుగుల మేర పేరుకుపోయిన పూడికను తొలగించామన్నారు. 

ఇక్కడకు 5 కిలోమీటర్ల నుంచి వచ్చి వాకింగ్ చేస్తున్నట్టు చెప్పడం ఆనందాన్నిచ్చిందన్నారు. షటిల్ కోర్టు, కమ్యూనిటీ హాల్, యోగా కేంద్రం, సైకిల్ ట్రాక్, పికిల్ బాల్ ఇలా అనేక క్రీడలు అందుబాటులోకి తెస్తున్నామని, ఇవన్నీ, ప్రజలు ఉచితంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.