హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని చెరువుల్లో మట్టి పోయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. అప్పుడే చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ పరిధులను కాపాడగలమన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై శనివారం ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మెల్లచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోయడాన్ని స్థానికులు హైడ్రా కమిషనర్దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అలాగే గండిపేట చెరువులో హిమాయత్‌నగర్ విలేజ్ వైపు మట్టి పోయడాన్ని హైడ్రా కమిషనర్ సీరియస్‌గా పరిగణించారు. వేసిన మట్టిని వెంటనే తొలగించాలన్నారు. 48 గంటల్లో తొలగించకపోతే మట్టి పోసిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్‌లో పార్కు కబ్జాల తొలగింపు
జూబ్లీహిల్స్ సర్కిల్-36 పరిధిలోని రోడ్డు నంబర్ 32లో రెండు ఎకరాలకు పైగా ఉన్న పార్కులో ఆక్రమణలను జీహెచ్‌ఎంసీతో కలిసి హైడ్రా తొలగించింది. పార్కు కబ్జాకు గురైందని, అందులో అక్రమ కట్టడాలు వచ్చాయని మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెనువెంటనే ఆక్రమణలను తొలగించడానికి ఆదేశించారు. పార్కుకు ఆనుకుని ఉన్న రెండు ఇళ్లవారు వారి వాచ్మెన్ కోసం, ఆవుల కోసం షెడ్డులు వేయడాన్ని కమిషనర్ సీరియస్‌గా పరిగణించారు. పార్కులోకి గేట్లు పెట్టుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ గేట్లను తొలగించి ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన గేట్‌ను ఏర్పాటు చేసి ప్రజలందరూ పార్కును సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ ఆదేశాలతో వెనువెంటనే ఆక్రమణలు తొలగించడం పట్ల అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
బుల్కాపూర్ నాలాను పునరుద్ధరిస్తం
హుస్సేన్ సాగర్‌కు మంచినీటిని తీసుకువచ్చే చారిత్రక బుల్కాపూర్ నాలాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు. మణికొండ ప్రాంతంలో బుల్కాపూర్ నాలా కబ్జాలకు గురవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీరు తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా పునరుద్ధరణతో చాలా ప్రాంతాలకు భూగర్భ జలాలు పెరుగుతాయని కమిషనర్ చెప్పారు.ఈ నాలా ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
