
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం తూంకుంట మున్సిపాలిటీలో ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవరాయాంజాల్ విలేజ్‌లో రహదారి ఆటంకాలు, వరద కాలువ ఆక్రమణలపై స్థానికులతో చర్చించి, రహదారి, కాలువలను వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం తూంకుటలోని వాసవి సుచిర్ ఇండియా వెంచర్లోనాలా కుంచించుకుపోవడాన్ని కమిషనర్ పరిశీలించారు. 9 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా 2 మీటర్లకే పరిమితం చేయడం వల్ల అదే వెంచర్‌లోని ప్లాట్లతో పాటు పైభాగంలో ఉన్న నివాసాలు కూడా మునిగిపోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల వర్షాలకు నీట మునిగిన వీడియోలు చూపించారు. దీంతో ఇరిగేషన్, హెచ్ఎండీఏ , మున్సిపాలిటీ అధికారులతో పాటు వెంచర్ యజమానులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.