తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు మరువకముందే పిల్లల్ని విక్రయిస్తున్న మరో ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పసికందులను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న 12 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే..
బుధవారం (డిసెంబర్ 24) హైదరాబాద్ నగరంలో పిల్లల్ని విక్రయిస్తున్న 12 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా నగరంలోని వివిధ ఆస్పత్రులకు ఏజెంట్లు పనిచేస్తూ శిశు విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 15 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠానుంచి ఇద్దరు చిన్నారులను కాపాడారు. ఒక్కో శిశువును రూ. 15లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
మియాపూర్, కూకట్ పల్లి, అల్విన్ కాలనీ, బీహెచ్ ఈఎల్ , జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్లు గుర్తించారు. ముఠాలోని 8మంది మహిళలు, ముగ్గురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాపాడిన చిన్నారులను రెస్క్యూ హోం కు తరలించారు.
