
- చెరువులు, పార్కుల్లో కట్టిన బిల్డింగులను పడగొట్టినం: హైడ్రా
- హైదరాబాద్‌లో 44 ఎకరాల జాగ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 43.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇందులో కొంత ఆక్రమణకు గురైన చెరువుల కింది భూమి కాగా, మరికొంత పార్కులకు సంబంధించిదని ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్కువగా స్థానిక పొలిటికల్ లీడర్లు జోక్యం చేసుకుని తహసీల్దార్లు, వీఆర్వోలు, బల్డియా, హెచ్ఎండీఏ అధికారులను మేనేజ్‌చేసి కబ్జా చేసినవేనని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యే దానం ప్రోద్బలంతో..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోద్బలంతో కొందరు లీడర్లు జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కు కాంపౌండ్వాల్కూల్చి జాగను కబ్జా చేశారని హైడ్రా వెల్లడించింది. బీఆర్ఎస్కు చెందిన మరో లీడర్ రత్నాకరం సాయిరాజు చింతల్ లేక్‌కు సంబంధించిన భూమిని కబ్జా చేసి షెడ్లు వేశాడని, దీంతో ఆ షెడ్లను కూల్చివేశామని చెప్పింది.
ఎంఐఎం, కాంగ్రెస్ లీడర్లనూ వదల్లే..
బహదూర్‌పురాకు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ముబిన్ అక్రమంగా నిర్మించిన గ్రౌండ్ ప్లస్ ఐదంతస్తుల బిల్డింగ్‌ను కూల్చేశామని హైడ్రా స్పష్టం చేసింది. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లో నిర్మించిన జీ ప్లస్ టూ భవనాన్ని నేలమట్టం చేసినట్లు చెప్పింది. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్(ఓఆర్వో స్పోర్ట్స్)అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని కూడా కూల్చివేశామంది.
కావేరీ సీడ్స్ ఓనర్, మాజీ టీటీడీ సభ్యుడు జీవీ భాస్కరరావుకు చెందిన అక్రమ కట్టడాన్ని, మంథని సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన సునీల్‌రెడ్డి అక్రమంగా నిర్మించిన భవనాన్ని పడగొట్టినట్లు పేర్కొంది. ప్రో కబడ్డీ యజమాని శ్రీనివాస్‌రావు భార్య అనుపమ నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చినట్టు హైడ్రా తెలిపింది.