- మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు,
- అమీన్ పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో కూల్చివేతలు
- 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్స్, గోడౌన్ నేలమట్టం
- అమీన్ పూర్లో 51 ఎకరాల ఎఫ్టీఎల్ కబ్జా..
- దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి
- జయభేరికి నోటీసులు.. 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
- రెండు రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జయభేరి అధినేత మురళీమోహన్
హైదరాబాద్ సిటీ/మాదాపూర్/దుండిగల్/రామచంద్రాపురం, వెలుగు: చెరువుల భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది. ఆదివారం మూడుచోట్ల కూల్చివేతలు చేపట్టింది. దుండిగల్‌లోని మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువులోని ఆక్రమణలను తొలగించింది. మల్లంపేట కత్వచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని 13 విల్లాలను కూల్చివేసింది. సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో రెండు బిల్డింగ్స్, ఒక డ్రైవ్ ఇన్, ఒక గోడౌన్, ఓ అపార్ట్మెంట్ ప్రహరీతో పాటు 30 గుడిసెలు నేలమట్టం చేసింది.
వీటిలో ఒకటి నాలుగు అంతస్తుల బిల్డింగ్, మరొకటి నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల బిల్డింగ్, ఒక గోడౌన్, షబ్బీర్ భాయ్ 4ఏఎం బిర్యానీ డ్రైవ్ ఇన్ ఉన్నాయి. ఇక అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో 5 నిర్మాణాలతో పాటు ఒక ప్రహరీ, రెండు సెక్యూరిటీ రూమ్స్ కూల్చివేశారు. మూడుచోట్ల ఉదయం 6 గంటలకు కూల్చివేతలు మొదలుపెట్టగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి.
ఫోర్జరీ సంతకాలతో విల్లాల పర్మిషన్లు..
దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట కత్వచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో 19 విల్లాలు నిర్మించినట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిలో 13 విల్లాలు నేలమట్టం చేశారు. ఇందులో 12 పూర్తిగా నిర్మాణం జరగ్గా, ఒక విల్లా పిల్లర్ల దశలో ఉంది. మిగతా 6 విల్లాల్లో నివాసం ఉంటుండడంతో వాటిపై చర్యలు తీసుకోలేదు. కత్వ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. ఈ ప్రాంతంలో లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ కంపెనీ 2020-–21లో 320 విల్లాలను నిర్మించింది. అయితే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకుంది. మిగతావన్నీ ఫోర్జరీ పర్మిషన్ తో నిర్మించింది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అనుమతులు తీసుకున్నట్టుగా సృష్టించింది. దీనిపై అప్పటి మేడ్చల్ కలెక్టర్ ఎంక్వైరీ చేసి, 208 విల్లాలకు నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంట్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లను ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్లను నిలిపివేయ్యాలని ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. కాగా, విల్లాల కూల్చివేతలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూల్చివేతలను బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకతను ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారు? అక్రమ నిర్మాణాలైతే అనుమతులు ఎందుకిచ్చారు? రిజిస్ర్టేషన్స్ ఎలా చేశారు? బ్యాంక్ లోన్లు ఎందుకిచ్చారు? అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము రూ.కోటి పెట్టి 2021లో విల్లాను కొనుగోలు చేశామని ఓ భాదితురాలు వాపోయారు. పైసా పైసా కూడబెట్టి కొన్నామని, తాము కొనుగోలు చేసినప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్టు ఎవరు చెప్పలేదనన్నారు.
Also Read :- హైడ్రాకు చట్టం.!చెరువు జాగాల్లో ఇండ్లు కడ్తే ఇక జైలుకే
మట్టి పోసి.. గుడిసెలు వేసి..
శేలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల మధ్యలో 26 ఎకరాల్లో సున్నం చెరువు విస్తరించి ఉంది. సర్వే నెంబర్ 12,12,14,16లలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఉండగా.. 15.23 ఎకరాల్లో నీళ్లు ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. అయితే గత కొద్ది రోజులుగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను కబ్జాదారులు ఆక్రమిస్తూ వస్తున్నారు. కొందరు చెరువుల్లో మట్టి నింపి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. కొంతమంది ఆక్రమణదారులు భారీ షెడ్లు వేసి గోడౌన్లుగా ఉపయోగిస్తున్నారు. మరికొందరూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే ఇండ్ల నిర్మాణం చేపట్టారు. విల్లాలు కూడా నిర్మించారు. అంతేకాకుండా చెరువు స్థలంలో కొందరూ బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటి దందాకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సున్నం చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు చెరువును పరిశీలించారు. అక్రమ నిర్మాణాలని తేలడంతో కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్ స్టేషన్లకు చెందిన పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుడిసెవాసుల ఆందోళన..
సున్నం చెరువు వద్ద కూల్చివేతల టైమ్ లో ఉద్రిక్తత నెలకొంది. గుడిసెలను తొలగించే సమయంలో వాటిల్లో ఉంటున్న జనం ఆందోళనకు దిగారు. గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు తమ సామాన్లను బయట పెట్టుకునేందుకు అధికారులు కొంత సమయం ఇచ్చారు. తర్వాత జేసీబీలతో గుడిసెలను తొలగించారు. తమ గుడిసెలను కూల్చివేయడంతో రోడ్డున పడ్డామంటూ బాధితులు వాపోయారు. చెరువులో కట్టిన విల్లాలను కూల్చివేయకుండా, తమ గుడిసెలను కూల్చివేయడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇద్దరినీ మాదాపూర్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోవైపు నాలుగంతస్తుల బిల్డింగ్ ను కూల్చివేస్తున్న సమయంలో దాని ఓనర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ స్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగా కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. మొదట కూల్చివేయమని చెప్పి, తర్వాత కూల్చివేయడంతో తమ సామగ్రి ధ్వంసమైందని డ్రైవ్ ఇన్ నిర్వాహకులు వాపోయారు. ఈ షటర్ చెరువు స్థలంలో ఉందని తమకు తెలియదని, లక్షలు ఖర్చు పెట్టి కిరాయికి తీసుకొని నడుపుతున్నామని చెప్పారు.
అమీన్ పూర్ పెద్ద చెరువులో 51 ఎకరాలు కబ్జా..
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణినగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీల్లో అమీన్పూర్పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. సర్వే నెంబర్ 323, 324, 329లోని దాదాపు 51 ఎకరాల ఎఫ్టీఎల్స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. రెండు దశాబ్దాల కింద చెరువు ఎఫ్టీఎల్చుట్టూ ఫెన్సింగ్ వేసి, భూమిని కబ్జా చేసినట్టు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మాణాలను తొలగించారు. కాగా, ఈ నిర్మాణాల వెనుక ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఉన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.
