హైదరాబాద్ సిటీ, వెలుగు: గొలుసుకట్టు చెరువులపై హైడ్రా దృష్టి పెట్టింది. గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లే సర్ ప్లస్(మిగులు జలాలు) కాల్వలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయన్న దానిపై హైడ్రా ఫోకస్ చేసింది. ఆక్రమణలతో సర్ ప్లస్ వాటర్ వెళ్లక తమ కాలనీలు మునుగుతున్నాయని ఇప్పటికే 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. మేడ్చల్-–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్ లోని బాబాఖాన్ కుంట సర్ ప్లస్ వాటర్ వెళ్లేందుకు రెండు ప్రధాన నాలాలున్నాయని, చెరువు నిండిన టైంలో సర్ ప్లస్ వాటర్ వెళ్లక అయోధ్య నగర్, ఇతర ప్రాంతాలు మునిగిపోతున్నాయని బహదూర్‌పల్లి వాసులు కంప్లయింట్ చేశారు.
గతంలో ఉన్న కాల్వలు ఆక్రమణలకు గురవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. బాబాఖాన్ కుంట నుంచి ముందుగా ఒక నాలా అలుగు నుంచి బయలు దేరి తర్వాత రెండుగా విడిపోతుందని, విడిపోయిన నాలాలోని ఒక నాలా సర్వే నంబర్ 208,179,180 మీదుగా వెళ్తోందని, అక్కడ ఆక్రమణలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రాను కోరారు. సర్ ప్లస్ వాటర్ వెళ్లే నాలాలను పునరుద్ధరించాలని కోరారు. హైడ్రా పరిధిలో 565 చెరువులుండగా, ఇందులో సగానికిపైగా గొలుసుకట్టు చెరువులే. దీంతో ఇటువంటి ఫిర్యాదులపై హైడ్రా విచారణ జరపనున్నట్లు తెలిసింది.
