హయత్ నగర్ సీఐపై హైడ్రా చీఫ్​ఫైర్

హయత్ నగర్ సీఐపై హైడ్రా చీఫ్​ఫైర్
  • కోహెడలోని వివాదాస్పద భూమిలో తల్వార్లు చూసి షాక్
  • మారణాయుధాలతో దాడి చేసినా కేసు పెట్టకపోవడంతో ఆగ్రహం
  • ఇలాంటివి చూసే హైడ్రా పీఎస్​పెట్టామన్న రంగనాథ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని హయత్‌ నగర్‌ సీఐ నాగరాజుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఫైరయ్యారు. కోహెడలోని సర్వే నంబర్ 951, 952లో వివాదాస్పద స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ భూమిలో తల్వార్లు చూసి షాకయ్యారు. స్థలం కొనుగోలుదారులకు, ఫాంహౌస్ ఓనర్​కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుండగా, ఇటీవల ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేసినా హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధేంటో తెలుస్తుందని సీఐను మందలించారు.  ఈ సందర్భంగా బాధితులకు భరోసా కల్పిస్తూ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యానే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

డాలర్‌ హిల్స్‌ కాలనీ పార్కు పరిశీలన

గండిపేట్: మణికొండలోని డాలర్‌ హిల్స్​లో కబ్జాకు గురైన పార్కును రంగనాథ్‌ పరిశీలించారు. ఫిర్యాదు ఇచ్చిన 15 రోజులకే స్పందించడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్‌ హామీ ఇచ్చారని కాలనీ వాసులు తెలిపారు.