
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 26 ఫిర్యాదులు అందాయి. హైదర్‌నగర్ డివిజన్ రామ్‌నరేష్ నగర్‌కాలనీ లో వర్షపునీరు వరద నీటి కాలువ ద్వారా వర్షపు నీరు సాఫీగా అలీతలాబ్ చెరువులోకి చేరుతుండేదని, ఈ నాలా ఎక్కడికక్కడ కబ్జాకు గురి అవ్వడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలను ముంచెత్తుతోందని రామ్‌నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఫిర్యాదు చేసింది.
మేడ్చల్ –- మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం రేణుక ఎల్లమ్మ కాలనీలో 1600 గజాల పార్కు స్థలంతో పాటు ఇతర ప్రభుత్వ స్థలం కలిపి మొత్తం 800 గజాల స్థలం కబ్జాకుగురి అవుతోందని, ఈ విషయాన్ని స్థాని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ నాగోల్ సర్వే నంబరు 36/6 లో ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు కంప్లయింట్చేశారు.
సర్వే నంబరు 35/5 ను చూపించి అనుమతులు తెచ్చుకుని 36/6 లోని 3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికారులకు ఈ విషయం తెలిసినా చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు బాధ్యతలను అప్పగించారు. అలాగే, బల్దియా ఆఫీసుల్లో నిర్వహించిన ప్రజావాణికి 219 , కలెక్టరేట్ ప్రజావాణికి 128 ఫిర్యాదులు వచ్చాయి.