- వాతావరణ శాఖ హెచ్చరికలు ఫాలో కావాలి
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో ఇటీవల కురిసిన వర్షం, దానివల్ల ఏర్పడిన ఇబ్బందులు మళ్లీ ఎదురుకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా అధికారులతో పాటు డీఆర్ఎఫ్ బృందాలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు సూచనలు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 913 చోట్ల వరద ముంచెత్తే ప్రాంతాలను గుర్తించామని, ఇందులో మేజర్ ప్రాబ్లం ఉన్న ప్రాంతాలు 257 ఉన్నాయన్నారు. ఈ పాయింట్ల వద్ద డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. 51 డీఆర్ ఎఫ్ బృందాలకు తోడు త్వరలోనే మెట్, స్టాటిక్ టీమ్‌లు కూడా వస్తాయన్నారు.
ఈ టీమ్స్ఇతర శాఖలతో కలిసి పని చేయాలని సూచించారు. 24 గంటలు వాతావరణ హెచ్చరికలను పరిశీలించి ముందే సన్నద్ధమవ్వాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తుతుందో.. అందుకు పరిష్కారం ఏంటో కూడా తెలియాలన్నారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్థానికులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంలో వారిని భాగస్వాములను చేయాలన్నారు. మ్యాన్‌హోల్స్ ఎక్కడ ఉన్నాయనేది గుర్తించే విధంగా అక్కడ దగ్గర్లోని గోడకు మార్కింగ్ చేయాలని సూచించారు. 9న కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాలపై శుక్రవారం సమీక్షించారు.
మెయిన్రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని, ఒక్క రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తితే రూ. 400 కోట్ల వరకూ నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారన్నారు. చెట్లు పడిపోయినప్పుడు సహాయక చర్యలకు డీఆర్ఎఫ్ వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదని. ఆ టైంలో బైకులపై చేరే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు హైడ్రా అడిషనల్డైరెక్టర్ వర్ల పాపయ్య , అడిషనల్ కమిషనర్ ఆర్ సుదర్శన్ పలు సూచనలు చేశారు. ఏసీపీలు పి.తిరుమల్, ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.
